పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని వినతి
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:14 PM
పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం బీజేపీ నాయకులు ఫారెస్టు డివిజనల్ ఆఫీసర్‌కు వినతి పత్రం అందించారు.
చెన్నూరు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం బీజేపీ నాయకులు ఫారెస్టు డివిజనల్ ఆఫీసర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ కోటపల్లి మండలంలోని బొప్పారం, ఎసన్‌వాయి, ఎడగట్ట, పిన్నారం పంచాయతీల పరిధిలో సుమారు 200 ఎకరాల భూమిని గత 40 సంవత్సరాలుగా నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. వీరిని అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది సరైంది కాదన్నారు. పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఎఫ్‌డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.