Share News

Brutal Crime Against a Tribal Woman: ఎలాగూ జైలుకెళ్తున్నా కదా అని మళ్లీ కిరాతకం

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:18 AM

తప్పు చేశాం శిక్ష పడడం రెండ్రోజుల్లో జైలుకెళ్లడం గ్యారంటీ.. ఆ వెళ్లేలోపు మళ్లీ అదే తప్పు చేస్తే ఏమవుతుందిలే అనుకున్నాడో పాత నేరస్థుడు..

Brutal Crime Against a Tribal Woman: ఎలాగూ జైలుకెళ్తున్నా కదా అని మళ్లీ కిరాతకం

  • మెదక్‌ గిరిజన మహిళ హత్యాచారం కేసులో వీడిన మిస్టరీ

  • మరో కేసులో జీవిత ఖైదు ఖాయమని తెలిసి దుశ్చర్యకు పాల్పడ్డ కిరాతకుడు

కొల్చారం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తప్పు చేశాం శిక్ష పడడం రెండ్రోజుల్లో జైలుకెళ్లడం గ్యారంటీ.. ఆ వెళ్లేలోపు మళ్లీ అదే తప్పు చేస్తే ఏమవుతుందిలే అనుకున్నాడో పాత నేరస్థుడు.. ఓ హత్యాచారం కేసులో జీవిత ఖైదు పడి జైలుకి వెళ్లేముందు తన కోరిక తీర్చుకునేందుకు మరో మహిళను అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి చంపేశాడు. మెదక్‌లో శనివారం వెలుగు చూసిన గిరిజన మహిళ హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. కూలి పని ఉందని మహిళను నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఫకీర్‌ నాయక్‌ అనే పాత నేరస్థుడేనని తెలిపారు. మెదక్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సేవాలాల్‌ తండాకు చెందిన ఫకీర్‌ నాయక్‌ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అంబోజిగూడలో నివాసం ఉంటున్నాడు. మెదక్‌ జిల్లాలోనే ఫకీర్‌ నాయక్‌పై గతంలో హత్యాచారం సహా ఏడు కే సులు ఉన్నాయి. ఇందులో మెదక్‌లో ఓ మహిళ హత్యాచారం కేసు విచారణ ముగిసి ఇటీవల తుది తీర్పునకు వచ్చింది. అక్టోబరు 13న కోర్టు తీర్పు వస్తుందనగా.. తనకు ఎలాగో జీవితు ఖైదు పడడం ఖాయమని గ్రహించిన నాయక్‌.. జైలుకి వెళ్లేలోపు ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం( అక్టోబరు10) మెదక్‌లోని కూలీల అడ్డా వద్ద పని కోసం ఎదురుచూస్తున్న మెదక్‌ జిల్లా కొల్పారం మండలంలోని ఓ తండాకి చెందిన గిరిజన మహిళపై కన్నేశాడు. పని ఉందని మాయమాటలు చెప్పి ఆమెను బస్సులో ఏడుపాయల కామన్‌ వద్దకు తీసుకొచ్చి అక్కడి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన కోరిక తీర్చాలని ఆమెను బలవంతం చేశాడు. అందుకు నిరాకరించిన ఆ మహిళను అక్కడి ఓ చెట్టుకు కట్టేసి వివస్త్రను చేసి అత్యాచారం చేశాడు. అనంతరం కర్ర, రాయితో ఆమెను తీవ్రంగా కొట్టి చనిపోయింది అనుకుని వదిలేసి వెళ్లిపోయాడు. మెదక్‌ చర్చి వెనక చెట్లపొదల్లో దుస్తులు దాచేసి అక్కడే స్నానం చేసి వేరే దుస్తులు మార్చుకుని రాత్రి అక్కడే నిద్రించాడు. మరోపక్క, రాత్రి అంతా అక్కడే అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగులోకి రాగా బాధిత మహిళ మాత్రం చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించింది. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీలను జల్లెడ పట్టిన పోలీసులు.. మెదక్‌ పాత బస్టాండ్‌ సమీపంలోని ఓ వైన్‌షాప్‌ వద్ద ఉన్న పాత నేరస్థుడు ఫకీర్‌ నాయక్‌ను గుర్తించారు. మంగళవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తాను చేసిన కిరాతకాన్ని బయటపెట్టాడు. పాత కేసులో ఎలాగూ శిక్ష పడుతుందనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపాడు. ఫకీర్‌ నాయక్‌ ఇచ్చిన సమాచారం మేరకు హతురాలి ముక్కుపుడక, హత్యకు ఉపయోగించిన రాయి, కర్ర, చర్చి వద్ద పార వేసిన దుస్తులను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫకీర్‌ నాయక్‌ మరో హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.

Updated Date - Oct 15 , 2025 | 04:18 AM