Kaleshwaram Barrage: బ్యారేజీలకు మరమ్మతులు చేయండి
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:53 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ/మరమ్మతులపై వారం రోజుల్లోపు సానుకూలంగా స్పందించాలి...
లేదంటే టెండర్లకు వెళ్లకుండాబ్లాక్‌లి్‌స్టలో పెడతాం
ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో పాల్గొననివ్వం
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనిర్మాణ సంస్థలకు సర్కార్ హెచ్చరిక
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ/మరమ్మతులపై వారం రోజుల్లోపు సానుకూలంగా స్పందించాలి. లేదంటే ఈ-ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు ఇతర వేదికల్లో తదుపరి టెండర్లు వేయకుండా బ్లాక్‌లి్‌స్టలో పెడతాం’ అని అన్నారం నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్-విజేత-పీఈఎ్‌స జాయింట్ వెంచర్‌ను, సుందిళ్ల నిర్మాణ సంస్థ నవయుగను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. టెండర్ ఒప్పందం ప్రకారం బ్యారేజీల మరమ్మతులు/పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేలనని, దీనికి సిద్ధం కాకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు సమర్పించిన డిపాజిట్లు(టెండర్ల కోసం దాఖలు చేసిన ఈఎండీ), రావాల్సిన పెండింగ్ బిల్లులను జప్తు చేస్తామని పేర్కొంది. వెంటనే బ్యారేజీల వద్ద పరీక్షలు చేస్తున్న కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పుణె)తో పాటు శాఖకు అవసరమైన సహకారం, యంత్రాలు, సిబ్బందిని సమకూర్చాలని, లేనిపక్షంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక్కో సంస్థకు 13 పేజీలతో కూడిన లేఖను రామగుండం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ మహ్మద్ దస్తగిర్ పంపించారు. 2019 వరదల అనంతరం అన్నారం బ్యారేజీ గేట్లను మూసివేయగా.. దిగువ భాగంలో సీసీ బ్లాకులన్నీ చెల్లాచెదురు అయ్యాయని, 2020 వరదలకు వేరింగ్ కోట్ దెబ్బతిన్నదని, 2020 ఏప్రిల్‌లో 35, 44 గేట్ల కింద సీపేజీలు గుర్తించామని పేర్కొన్నారు. ఆ తర్వాత 2021 జనవరి 28, 38 గేట్ల దగ్గర, 2024 జనవరిలో 35వ నెంబర్‌గేటు దిగువ భాగంలో సీపేజీలు ఏర్పడ్డాయని వెల్లడించారు. వీటిపై ఆరు నోటీసులు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చారని తెలిపారు. బ్యారేజీల్లో లోపాలన్నీ కూడా డిఫెక్ట్ లయబుల్టీ కాలంలోనే బయటపడ్డాయని, దీనివల్ల డిఫెక్ట్ లయబుల్టీ కాలం కూడా దానంతటదే పెరిగినట్లు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మూడేళ్లకాలం ఉండగా.. అనంతరం బ్యారేజీని యాజమానికి ఒప్పందం ప్రకారం లోపాల్లేకుండా అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం బ్యారేజీ దిగువ భాగంలో వరద ప్రవాహ ఉధృతిని నియంత్రించే వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, చెల్లాచెదురైన సిమెంట్ కాంక్రీట్ బ్లాకులను సరిచేయాల్సి ఉంటుందని, సీపేజీలను శాశ్వతంగా కట్టడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేలాది మంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని, ఇంతటి కీలక ప్రాజెక్టు విషయంలో సహాయ నిరాకరణ చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇక సుందిళ్ల బ్యారేజీ విషయంలోనూ ఇవే అంశాలతో లేఖ రాశారు. వారంలోగా సానుకూలంగా ముందుకు రావాలని గుర్తు చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.