kumaram bheem asifabad- కౌలు.. కన్నీళ్లు..
ABN , Publish Date - Nov 20 , 2025 | 10:51 PM
జిల్లాలోని కౌలు రైతులు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, కౌలు ధరలు గణనీయంగా పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు వర్తించక పంటలు దిగుబడి రాక తీవ్ర అవస్థలు పడుతు న్నారు. ఈ వానాకాలం సీజన్‌లో కురిసిన అధిక వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి.
- తగ్గిన దిగుబడులు
- అందని ప్రభుత్వ రాయితీలు
- భరోసా పథకం అమలు చేయని సర్కార్
- అప్పులు తప్ప మిగిలిందేమీ లేదని కౌలు రైతుల ఆవేదన
బెజ్జూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కౌలు రైతులు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, కౌలు ధరలు గణనీయంగా పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు వర్తించక పంటలు దిగుబడి రాక తీవ్ర అవస్థలు పడుతు న్నారు. ఈ వానాకాలం సీజన్‌లో కురిసిన అధిక వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. దిగుబడులు గణనీయంగా తగ్గడంతో కౌలు రైతులు కుదేలయ్యారు. ప్రభుత్వం కౌలు రైతులకు భరోసా పథకాన్ని అమలు చేసి ఉంటే తమకు కాస్తా ప్రయోజనం కలిగేదని చెబుతు న్నారు. నిజానికి కౌలు రైతులను ఆదుకునేందుకు ఏటా ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రకటించింది. అందుకు వ్యవసాయ శాఖ ద్వారా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపడుతామని చెప్పినా ఆచరణకు నోచుకోవడం లేదు. సాధారణ పట్టాదారులైన కర్షకుల మాదిరి గానే తమకూ భరోసా వస్తుందని కౌలు రైతులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా పథకం అమలుపై ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో వారికి కన్నీరే మిగిలింది.
- 4.26 లక్షల ఎకరాల్లో పంటలు..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 4.26లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో 3.50లక్షల ఎకరాల్లో పత్తి, 56వేల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు అవుతు న్నాయి. జిల్లాలో సుమారు 20వేల మంది కౌలు రైతులు ఉన్నారు. ఏటా వేల సంఖ్యలో రైతులు భూములు కౌలుకు తీసుకొని వివిధ పంటలు పండిస్తున్నారు. వరి సాగు చేసే అన్నదాతలకు ప్రభుత్వం సన్నరకం ధాన్యంపై రూ.500బోనస్ ప్రకటించడంతో కౌలు ధరలు ఆకాశన్నంటాయి. ఎకరానికి రూ.20వేల వరకు కౌలు చెల్లించాల్సి వస్తోంది. గతంలో జిల్లాలో కౌలు ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పలకగా, బోనస్ కారణంగా కౌలు ధరలకు రెక్కలొచ్చాయి, పంట దిగు బడితో సంబంధం లేకుండా రైతులు కౌలు చెల్లించాల్సి వస్తోంది. ఏటేటా ప్రకృతి వైపరిత్యాల కారణంగా పంటలు నష్టపోయి దిగుబడి తగ్గుతుం డడంతో ఆందోళన చెందుతున్నారు.
- అందని ప్రభుత్వ పథకాలు..
కౌలుకు భూములు తీసుకొని సాగుచేసే రైతుల కు ప్రభుత్వం అందించే ఏ పథకాలు కూడా అంద డం లేదు. సాగుకు బ్యాంకుల్లో రుణాలు అందవు, రైతుబంధు, రైతుబీమా, యాంత్రీకరణ పథకాలు కూడా వారి దరిచేరవు. ప్రకృతి వైపరిత్యాల కార ణంగా పంట నష్టపోయిన సందర్బంలో వారికి పరిహారం కూడా రాని పరిస్థితి. గతంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో వారు అన్ని పథకాలకు దూరంగానే ఉన్నారు.
పెట్టుబడి కూడా రాలేదు..
- పేదం సాయికుమార్, రైతు, పెద్దసిద్దాపూర్
ఈ ఏడాది నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను. ఎకరానికి రూ.18వేలు కౌలు చెల్లించాను. ఎకరాకు 10క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సి ఉంది. కానీ వర్షాలకు పంట దెబ్బతిని కేవ లం ఐదు క్వింటాళ్లలోపే వచ్చింది. దీంతో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంది.
వర్షాలతో తగ్గిన దిగుబడి..
- కోర్తే వెంకటి, రైతు
కౌలుకు తీసుకున్న భూమిలో పత్తి సాగు చేయగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. వర్షాలకు పంట తెగుళ్ల బారి న పడింది. దీంతో దిగుబడులు తగ్గడంతో పెట్టుబ డి కూడా రాలేదు. ప్రభుత్వం ఆదుకొని కౌలు రైతులకు భరోసా అందించేందుకు చర్యలు తీసుకోవాలి.