Share News

Nalgonda: రచయిత వెంకట్‌ గౌడ్‌ కన్నుమూత

ABN , Publish Date - Sep 26 , 2025 | 07:22 AM

ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, కవి, రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌ (48) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విద్యానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స...

Nalgonda: రచయిత వెంకట్‌ గౌడ్‌ కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, కవి, రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌ (48) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విద్యానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచిడారు. వెంకట్‌ స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా మునగాల మండలం కలుకోవ గ్రామం. నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లిష్‌ పూర్తిచేశారు. నీలగిరి సాహితీ సమావేశాల ప్రభావంతో కవిత్వం రాశారు. ప్రత్యేక తెలంగాణ, బహుజన చైతన్యమే లక్ష్యంగా పలు రచనలు చేశారు. ఆ క్రమంలోనే సర్దార్‌ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర రాశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌తో సంభాషణ ‘వొడువని ముచ్చట’, నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్‌.విద్యాసాగర్‌ రావు ఇంటర్వ్యూ ‘ఆలోచనలు’, బొమ్మగాని ధర్మభిక్షంతో ముచ్చట తదితర పుస్తకాలను వెలువరించారు. నోముల సత్యనారాయణ జీవితానుభవాలు ‘నోముల సర్‌ అన్‌టోల్డ్‌ లెసన్స్‌’ సంకలనం తీసుకురావడంలోనూ ముఖ్యపాత్ర వహించారు. వెంకట్‌ గౌడ్‌ మృతికి మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సాహితీవేత్తలు అంబటి సురేంద్ర రాజు, నందిని సిధారెడ్డి, సాంస్కృతిక ఉద్యమకారుడు భూపతి వెంకటేశ్వర్లు తదితరులు సంతాపం ప్రకటించారు.

Updated Date - Sep 26 , 2025 | 07:23 AM