Share News

S V Rama Rao Passes Away: సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు కన్నుమూత

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:37 AM

తెలుగు సాహిత్య విమర్శ, అధ్యయనంలో మేటి, ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు 85 కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో..

S V Rama Rao Passes Away: సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు కన్నుమూత

  • 40కి పైగా విమర్శనా పుస్తకాలు రచించిన ఎస్వీ

  • తెలుగు పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాత్ర

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్య విమర్శ, అధ్యయనంలో మేటి, ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు(85) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రితో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. మహబూబ్‌నగర్‌ జిల్లా శ్రీరంగాపురంలో 1941 జూన్‌ 5న జన్మించిన ఎస్వీ రామారావు పూర్తి పేరు సుగూరు వెంకట రామారావు. హైదరాబాద్‌ నిజాం కళాశాలలో పీయూసీ, డిగ్రీ చేసిన ఎస్వీ రామారావు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. అలాగే, సినారె పర్యవేక్షణలో ‘తెలుగులో సాహిత్య విమర్శ - అవతరణ వికాసాలు’ అంశంపై పరిశోధన చేసి ఓయూ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. 1966లో ఓయూలో తెలుగు అధ్యాపకునిగా చేరిన ఎస్వీ రామారావు 1987లో ఆచార్యుడిగా పదోన్నతి పొందారు. ఓయూ తెలుగుశాఖ అధ్యక్షుడిగా, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ సంచాలకుడిగా పని చేశా రు. 2001లో ఉద్యోగ విరమణ పొందిన ఆయన ఒకటో తరగతి నుంచి ఎంఏ కోర్సు వరకు తెలుగు పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలక భాగస్వామ్యం వహించారు. ఎస్వీ రామారావు 40కిపైగా సాహిత్య విమర్శ పుస్తకాలు రచించారు. అందులో తెలుగు సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాహిత్య చరిత్ర, సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర, సమగ్ర తెలుగు వాఙ్మయకోశం, పాలమూరు ఆధునిక కవుల చరిత్ర తదితర రచనలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. సాహిత్య విమర్శలో ఎస్వీ రామారావు చేసిన కృషిని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం, శ్రీకృష్ణ దేవరాయ భాషానిలయం దాశరథి స్మారక పురస్కారంతో గౌరవించాయి. బూర్గుల రామకృష్ణారావు, బీఎన్‌ శాస్త్రి స్మారక అవార్డులతోపాటు ఎన్నో పురస్కారాలు వరించాయి. పలువురు సాహిత్య విమర్శకులు ఎస్వీ రామారావు మీద అభిమానంతో ‘విమర్శనా రామం’ వ్యాస సంకలనాన్ని వెలువరించారు. సాహిత్య విమర్శను విశ్వవిద్యాలయ స్థాయిలో చారిత్రక దృష్టి తో అధ్యయనం చేయడానికి ఎస్వీ రామారావు బాటలు వేశారని ఏపీ, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. ఎస్వీ రామారావు మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి, ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జె. చెన్నయ్య, కవి యాకూబ్‌, ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కాసీం తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఎస్వీ రామారావుకు భార్య స్వయప్రభ. కుమారుడు సాయి గిరిధర్‌ ఉన్నా రు. అమెరికాలో స్థిరపడిన సాయి గిరిధర్‌ గురువారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకోనుండగా ఎస్వీ రామారావు అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి. ఎల్బీనగర్‌ చిత్ర లేఅవుట్‌లోని ఆయన స్వగృహంలో ఎస్వీ రామారావు భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంచుతామని, అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - Sep 18 , 2025 | 04:37 AM