High Blood Pressure: ఆర్‌డీఎన్ చికిత్సతో అధిక రక్తపోటుకు చెక్
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:39 AM
భారతదేశంలో అనియంత్రిత రక్తపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని.. రీనల్ డీనెర్వేషన్ (ఆర్‌డీఎన్) చికిత్స దీనికి చక్కటి పరిష్కారమని ఏషియన్...
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యుల వెల్లడి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో అనియంత్రిత రక్తపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని.. రీనల్ డీనెర్వేషన్ (ఆర్‌డీఎన్) చికిత్స దీనికి చక్కటి పరిష్కారమని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ ప్రకారం భారత దేశంలో 20 కోట్ల మంది రక్తపోటు బాధితులు ఉంటే, వారిలో రెండు కోట్లమంది మాత్రమే దీనిని నియంత్రణలో ఉంచుకుంటున్నారని ఆందోళన వెలిబుచ్చారు. హైబీపీని నియంత్రణలో పెట్టే ఆర్‌డీఎన్ చికిత్స గురించి.. ఏఐజీ హాస్పిటల్స్ క్యాథ్‌ల్యాబ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనూజ్ కపాడియా వివరించారు. తరచుగా తలనొప్పి, నీరసం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న 41 ఏళ్ల వ్యక్తిని ఈ ఆర్‌డీఎన్ చికిత్సతోనే సాధారణ స్థితికి తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అతడి రక్తపోటు ఎప్పుడూ 170/100గా ఉండేదని.. ఎన్ని మందులు వాడినప్పటికీ ఫలితం లేకపోవడంతో డీనెర్వేషన్ చికిత్స తీసుకున్నాడని, కొద్ది రోజుల్లోనే అతని రక్తపోటు 130/88కి దిగివచ్చిందని తెలిపారు. దీంతో అతడికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయని చెప్పారు. ఆర్‌డీఎన్ చికిత్సతో ఈ తరహా రోగులలో సిస్టోలిక్ రక్తపోటు 50ఎంఎంహెచ్‌జీ వరకూ తగ్గడం గమనించామన్నారు. సాధారణ బీపీ ఔషధాలు పనిచేయనివారికి ఆర్‌డీఎన్ చికిత్స చక్కటి ఉపశమనంగా నిలిచే అవకాశాలున్నాయన్నారు. సిస్టోలిక్ బీపీని కేవలం 10ఎంఎంహెచ్‌జీ తగ్గించుకుంటేనే.. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం 27ు, గుండె విఫలమయ్యే ముప్పు 28ు, కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం 17ు తగ్గే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. కాగా.. ఇది అతి తక్కువ కోత అవసరమయ్యే క్యాథెటర్ ఆధారిత చికిత్స అని ఏఐజీ ఆస్పత్రుల క్యాథ్‌ల్యాబ్ కో డైరెక్టర్ డాక్టర్ స్వరూప్ జి భరాడీ తెలిపారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాజీవ్ మీనన్, డాక్టర్ ఆర్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.