Share News

Religious Teaching in School: బడిలో క్రైస్తవ మతబోధన!

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:27 AM

రంగల్‌ జిల్లా వర్ధన్నపేటలోని ఫుస్కోస్‌ స్కూల్‌ అనే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు క్రైస్తవమత బోధనలు, వారితో ప్రార్థనలు చేయించిన తాలూకు వీడియో బయటపడింది...

Religious Teaching in School: బడిలో క్రైస్తవ మతబోధన!

  • గదిలో 4 తరగతుల పిల్లలను కూర్చోబెట్టి చర్చి ఫాదర్‌ బోధనలు.. దగ్గరుండి సహకరించిన ప్రిన్సిపల్‌ మేరీ

  • వర్ధన్నపేటలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఘటన

  • వీడియో బయటకు..ప్రిన్సిపల్‌ తత్తరపాటు

  • విచారణకు ఆదేశించిన డీఈవో

వర్ధన్నపేట రూరల్‌/ వర్ధన్నపేట, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలోని ‘ఫుస్కోస్‌ స్కూల్‌’ అనే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు క్రైస్తవమత బోధనలు, వారితో ప్రార్థనలు చేయించిన తాలూకు వీడియో బయటపడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ బడిలోని 1, 6, 8, 9 తరగతులకు చెందిన 20 మంది పిల్లలను ఒకే క్లాసులో కూర్చోబెట్టి.. ప్రిన్సిపల్‌ మేరీ సమక్షంలో చర్చి ఫాదర్‌ వేషధారణలో ఉన్న వ్యక్తి మతబోధనలు నిర్వహిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. శుక్రవారం ఉదయం మొదటి పీరియడ్‌ కేటాయించిన సమయంలో చర్చి ఫాదర్‌ పిల్లలకు ఈ మత బోధనలకు సంబంధించిన క్లాసు తీసుకున్నారు. తాము చేసే పనుల్లో, భోజన సమయాల్లో ప్రేయర్‌ చేయాలంటూ పిల్లలకు ఫాదర్‌ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. కాగా ఈ ప్రార్థనలు చేయించినట్లుగా చెబుతున్న వ్యక్తి.. ఆ బడికి ఆనుకొని ఉన్న చర్చిలోని ఫాదర్‌ అని, ఆయన పేరు చిన్నపు రెడ్డి అని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం ఓ విద్యార్థి తండ్రి.. స్కూల్‌ ఫీజు కట్టేందుకు వెళ్లగా, గదిలో మత బోధనలు జరుగుతుండటాన్ని చూసి.. మొబైల్‌ ఫోన్లో వీడియో తీశారు. ఆ వీడియోనే బయటకు పొక్కి.. వైరల్‌ అయింది. ఈ ఘటన పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, హిందూ, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫుస్కోస్‌ స్కూల్‌లో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు ఉంది. బడిని క్రైస్తవ మతానికి చెందిన యాజమాన్యమే నిర్వహిస్తున్నా.. అన్ని మతాలకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ బడిలో ప్రతి బుధ, శుక్రవారాల్లో గుట్టుగా మత బోధనలు జరుగుతున్నాయని.. ఆ సమయాల్లో బయటి వ్యక్తులెవరూ లోపలికి ప్రవేశించకుండా గేట్లు మూసేస్తారని స్థానికులు చెబుతున్నారు. కాగా బయటపడిన వీడియోకు సంబంధించి ప్రిన్సిపల్‌ మేరీ స్పందించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విలువైన విషయాలు చెబుతున్నామని, క్రైస్తవ విద్యార్థులకు మాత్రమే మత బోధనలు చేస్తున్నామని రకరకాలుగా మాట్లాడారు. బడిలో మత ప్రచార బోధనలకు సంబంధించిన ఘటనపై ఏబీవీపీ ప్రతినిధులు తహసీల్దార్‌, ఎంఈవో కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలపై కేసు నమోదు చేసి.. గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

మత ప్రచారం నిజమేనని నిర్ధారణ

ఫుస్కోల్‌ స్కూల్‌లో మత ప్రచారం జరిగిందనే విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ విచారణకు అదేశించింది. ఈ మేరకు వర్ధన్నపేట ఎంఈవో శ్రీధర్‌ శుక్రవారమే పాఠశాలకు చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడారు. మత ప్రార్థనల్లో పాల్గొన్న విద్యార్థుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మత ప్రచారం జరిగిందని నిర్ధారించారు.

Updated Date - Oct 11 , 2025 | 02:27 AM