Share News

Religious Harmony Shine: వెల్లివిరిసిన మత సామరస్యం!

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:03 AM

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వేళ బోరబండ ప్రాంతంలో మతసామరస్యం వెల్లివిరిసింది. బోరబండ డివిజన్‌లోని కొమరం భీం కమ్యూనిటీ హాల్‌లో అధికారులు ఓ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు...

Religious Harmony Shine: వెల్లివిరిసిన మత సామరస్యం!

  • హనుమాన్‌ ఆలయంలోని కమ్యూనిటీ హాల్‌లో పోలింగ్‌ బూత్‌

  • ఆలయం బయటే చెప్పులు వదిలి వెళ్లి ఓట్లేసిన ముస్లింలు

హైదరాబాద్‌, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వేళ బోరబండ ప్రాంతంలో మతసామరస్యం వెల్లివిరిసింది. బోరబండ డివిజన్‌లోని కొమరం భీం కమ్యూనిటీ హాల్‌లో అధికారులు ఓ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. ఆ బూత్‌కు చేరుకునేందుకు పక్కనే ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయం ముఖద్వారం నుంచే వెళ్లాలి. ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లి ఆలయం మెట్లు కొన్ని ఎక్కిన తర్వాత ఎడమవైపున ఆ కమ్యూనిటీ హాల్‌ ఉంటుంది. ఈ పోలింగ్‌ బూత్‌లో ఓటు ఉన్న వారిలా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఓటు వేసేందుకు హనుమాన్‌ గుడి లోపలికి వెళ్లడం తప్పనిసరి కాగా.. ముస్లింలు ఆలయం ముఖద్వారం వద్దే తమ పాదరక్షలను విడిచి లోపలికి వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఇక, కొమరం భీం కమ్యూనిటీ హాల్‌, పక్కనే ఉన్న జీహెచ్‌ఎంసీ బంజారా నగర్‌ కమ్యూనిటీ హాల్‌ పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో క్రైస్తవ మహిళలు సేవలు అందించారు. ఈ రెండు ఘటనలు స్థానికుల దృష్టిని ఆకర్షించాయి.

Updated Date - Nov 12 , 2025 | 03:03 AM