Share News

Registration Departments website: రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వర్‌ డౌన్‌!

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:37 AM

ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే శాఖల్లో ఒక్కటైన రిజిస్ట్రేషన్‌ శాఖలో రెండ్రోజులుగా అనేక సేవలు నిలిచిపోయాయి...

Registration Departments website: రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వర్‌ డౌన్‌!

  • సాంకేతిక సమస్యలతో మొరాయించిన ఆ శాఖ వెబ్‌సైట్‌

  • నిలిచిపోయిన క్రయవిక్రయాలు

  • స్లాట్‌ బుకింగ్‌, ఈసీ, చలానాల చెల్లింపుల్లో ఇబ్బందులు

  • గంటల తరబడి ప్రజల అవస్థలు

  • అధికారుల తీరుపై విమర్శలు

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే శాఖల్లో ఒక్కటైన రిజిస్ట్రేషన్‌ శాఖలో రెండ్రోజులుగా అనేక సేవలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ మంగళవారం నుంచి మొరాయించింది. దీంతో చలానాలు కట్టేందుకు, ఈసీ తీసుకునేందుకు, మార్కెట్‌ విలువలు చూసుకునేందుకు, చివరికి స్లాట్‌ బుకింగ్‌కు కూడా వీలుపడడం లేదు. సర్వర్‌ సహకరించకపోవడంతో చిన్నచిన్న పనులకు కూడా ప్రజలు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వెబ్‌సైట్‌ పనిచేయకపోవడం, సర్వర్‌ మొరాయించడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆగిపోయే పరిస్థితి నెలకొంది. అయితే, సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాల్సిన రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

ఒరాకిల్‌ సంస్థ 20 ఏళ్ల క్రితం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ పని చేస్తోంది. సాంకేతికంగా ఎన్నో మార్పులు జరిగినా వాటికి అనుగుణంగా ఈ వెబ్‌సైట్‌లో మార్పులు జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం నుంచి వెబ్‌సైట్‌ మొరాయించగా బుధవారం సర్వర్‌ పూర్తిగా డౌన్‌ అయింది. దీంతో చలానాలు కట్టేందుకు క్యూలో ఉన్న వారు గంటల కొద్దీ నిరీక్షించారు. రాష్ట్రంలో సగటున ప్రతి రోజు 5వేల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటన్నింటికీ చలానాలు తియ్యాల్సి ఉం టుంది. వందల మంది ఈసీలు డౌన్‌లోడ్‌ చేసుకుంటుంటారు. ఈసీ డేటా బ్యాకప్‌ రాకపోవడంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చాలామందికి ఎదురుచూపులే మిగిలాయి. ఇక, స్లాట్‌ బుకింగ్‌కు కూడా వెబ్‌సైట్‌ సహకరించలేదు. మార్కెట్‌ విలువలు చూసుకోవాల న్నా వీలు కాని పరిస్థితి. రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ను గత ఏడాది సగటున రోజుకి 5లక్షల మంది సందర్శించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 10 లక్షల వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వెబ్‌సైట్‌ సందర్శించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నా.. ఆ ట్రాఫిక్‌కు అనుగుణంగా వెబ్‌సైట్‌ నిర్వహణ లేదనే విమర్శలు ఉన్నాయి. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్‌ పత్రాల అప్‌లోడ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయని, కొన్నిసార్లు ఒకే దస్త్రం రెండు, మూడు సార్లు అప్‌లోడ్‌ అవుతోందని, ఓటీపీలు రావడం లేదని, డిజిటల్‌ సంతకాలు అథంటికేషన్‌లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నా యి. అలాగే, వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పీడీఎఫ్‌ ఫైల్స్‌ కొన్నిసార్లు కరెప్ట్‌ అని వస్తున్నాయని అంటున్నారు. అయితే, ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు సర్వర్‌ సామర్థ్యం పెంచాలని, బ్యాకప్‌ సర్వర్లు ఏర్పాటు చేసుకోవాలని, రియల్‌ టైం మానిటరింగ్‌ సిస్టమ్‌ సమకూర్చుకోవాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 05:37 AM