Registration Department: రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో వృద్ధి
ABN , Publish Date - May 14 , 2025 | 06:11 AM
రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఏప్రిల్‌లో ఒక శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరగడం, డిజిటలైజేషన్ చర్యలు వృద్ధికి కారణమయ్యాయి.
ఏప్రిల్‌లో ఒక శాతం పెరిగిన రాబడి
హైదరాబాద్, మే 13(ఆంధ్రజ్యోతి): కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో వృద్ధి సాధించింది. గత ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏప్రిల్‌లో రాబడి ఒక శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్‌లో క్రయ విక్రయాలు పెరగడం, డిజిటలైజేషన్ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో రిజిస్ట్రేషన్ల లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, ఆర్థిక పురోగతికి ఈ వృద్ధి సంకేతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ శాఖకు రూ.1,115.22 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏప్రిల్‌లో రూ.11.32 కోట్లు అదనంగా వచ్చింది. మరోవైపు, గత ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,157 దస్తావేజులు రిజిస్టర్ కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో 18,755 డాక్యుమెంట్లు అదనంగా రిజిస్టర్ అయ్యాయి. ఇదే ఒరవడి ముందు కూడా ఉంటుందని జూన్ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదికి రిజిస్ట్రేషన్ శాఖ రూ.19,087 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టింది. గత ఏడాది రూ.18 వేల కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.14,307 కోట్ల ఆదాయం వచ్చింది.