Share News

Reflective Stickers Made Mandatory: కారైనా.. బైకైనా.. లారీ అయినా.. ఇకపై ఇది ఉండాల్సిందే..

ABN , Publish Date - Sep 13 , 2025 | 05:38 AM

ఇటీవలి కాలంలో ఇటువంటి వార్తలు ఎక్కువయ్యాయి! రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లేదా నెమ్మదిగా వెళుతున్న వాహనం దగ్గరకు వచ్చే వరకూ కనిపించకపోవడంతో..

Reflective Stickers Made Mandatory: కారైనా.. బైకైనా.. లారీ అయినా.. ఇకపై ఇది ఉండాల్సిందే..

  • ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కీలక నిర్ణయం

  • వాహనం, దాని మూలలు కనిపించేలా స్టిక్కర్‌ ఉండాలి

  • రాత్రిపూట వాహనాలు స్పష్టంగా కనిపించడానికే నిబంధన

  • అధీకృత సంస్థ నుంచే స్టిక్కర్లు కొనాలని ఉత్తర్వుల్లో ఆదేశం

ఇటీవలి కాలంలో ఇటువంటి వార్తలు ఎక్కువయ్యాయి! రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లేదా నెమ్మదిగా వెళుతున్న వాహనం దగ్గరకు వచ్చే వరకూ కనిపించకపోవడంతో జరిగే ప్రమాదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు కావచ్చు.. సరుకు రవాణా చేసే భారీ వాహనాలు కావచ్చు.. అన్నిటికీ వెనక రిఫ్లెక్టింగ్‌ స్టిక్కర్లను అతికించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి వేళల్లో ముందు వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపించడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదాలనివారణ చర్యల్లో భాగంగా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలనూ పక్కాగా అమలు చేయనున్నామన్నారు. రిఫ్లెక్టింగ్‌ స్టిక్కర్ల వాడకాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని,రాత్రి వేళ వాహనం, దాని మూలలు స్పష్టంగా కనిపించేలా ఈ స్టిక్కర్‌ ఉండాలని వివరించారు. రిఫ్లెక్టర్ల పరిశీలనకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసేలా కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న వాహనాల వెనక స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నారని, పాత వాహనాలు తప్పనిసరిగా స్టిక్కర్‌ను ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, మోటారు క్యాబ్‌లు, ఆటోలు, ఓమ్నీ బస్సులు, హైడ్రాలిక్‌ ట్రాలర్లు తదితర అన్ని వాహనాలకు వెనక భాగంలో ఇకపై రిఫ్లెక్టింగ్‌ స్టిక్కర్లు తప్పనిసరి చేశారు. రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు, నంబరు ప్లేట్లు ఏఐఎస్‌ 057, 090, 089 నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, వీటిని తనిఖీ చేయడానికి క్యూఆర్‌ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, రవాణా శాఖ అధీకృత సంస్థలు మాత్రమే వీటిని సరఫరా చేయాలని ఉత్తర్వుల్లో నిర్దేశించారు. వాహన యజమానులందరూ ఈ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. - ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

Updated Date - Sep 13 , 2025 | 06:47 AM