Share News

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నామినేషన్లు

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:44 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. శనివారం 31 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్‌లు వేశారు...

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నామినేషన్లు

  • ఒకేరోజు 31 మంది 48 సెట్ల దాఖలు.. ఇప్పటి వరకు 96 నామినేషన్లు

బంజారాహిల్స్‌/చిక్కడపల్లి/బోరబండ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. శనివారం 31 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్‌లు వేశారు. దీంతో అభ్యర్థుల జాబితా 96కు చేరింది. కాగా సమయం ముగుస్తున్న సమయంలో సుమారు 20 మంది నామినేషన్‌లు వేసేందుకు రాగా రిటర్నింగ్‌ అధికారులు వారికి టోకెన్లు ఇచ్చి ఈ నెల 21న రావాల్సిందిగా సూచించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత.. ఎమ్మెల్యేలు సబితారెడ్డి, సుధీర్‌రెడ్డి, వివేకానందతో కలిసి మూడో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్‌రెడ్డి తరఫున ఆయన భార్య మొదటి సెట్‌ నామినేషన్‌ వేశారు. గ్రూప్‌-1 నిరుద్యోగ జేఏసీ నుంచి అస్మాబేగం నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ భూ నిర్వాసిత బాధితుల్లో ముగ్గురు రైతులు నామినేషన్‌ వేయగా, మాల సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్‌లు వేసేందుకు వచ్చారు. అయితే వీరిలో కొన్ని నామినేషన్‌లు స్వీకరించిన అధికారులు మిగతా వారికి టోకెన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు చెరుకు రాంచందర్‌ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మాలలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు చెప్పారు.

టీయూజేఏసీ నుంచి 20 మంది పోటీ!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ(టీయూజేఏసీ) అభ్యర్థుల మొదటి జాబితాను శనివారం చిక్కడపల్లిలోని జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్‌ రాంరెడ్డి విడుదల చేశారు. మొత్తం 20 అభ్యర్థులు జాబితాలో ఉన్నారు. రెండో జాబితా త్వరలోనే విడుదల చేస్తామని రాంరెడ్డి, జేఏసీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్‌ చెప్పారు. ఉద్యమకారులను విస్మరించిన అన్ని పార్టీలకు ఈ ఎన్నికలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు.

నవీన్‌ యాదవ్‌పై దుష్ప్రచారం.. పోలీసులకు కాంగ్రెస్‌ ఫిర్యాదు

కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ముస్లింల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక (ఆంధ్రజ్యోతి కాదు) న్యూస్‌ ఏజెన్సీ పేరుతో ప్రచురితమైనట్లు పేపర్‌ కటింగ్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఫేక్‌ న్యూస్‌తో నవీన్‌ యాదవ్‌పై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఎర్రగడ్డకు చెందిన కాంగ్రెస్‌ నేత సయ్యద్‌ నయీముద్దీన్‌ బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Oct 19 , 2025 | 03:44 AM