Share News

Panchayat Elections: పోటెత్తిన పోటీ

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:06 AM

రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు.

Panchayat Elections: పోటెత్తిన పోటీ

  • చివరి రోజే 20 వేలకు పైగా నామినేషన్లు.. తొలి రెండు రోజులతో పోలిస్తే 4 రెట్లు

  • ఓటు కోసం క్యూలో నిలబడ్డ ఓటర్లలా..

  • నామినేషన్‌ కోసం రాత్రి కూడా లైన్‌లో అభ్యర్థులు

  • నామినేషన్ల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు

  • మండల స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు

  • సొంత పార్టీలో పోటీ ఉన్న చోట్ల సర్దుబాట్లు

  • పార్టీ రహితమైనా.. సై అంటే సై అంటున్న పార్టీలు

  • పట్టున్న చోట్ల ఏకగ్రీవాల కోసం నేతల మంతనాలు

  • పెద్ద సంఖ్యలో పంచాయతీల ఏకగ్రీవం

  • నేటి నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు. తొలి రెండు రోజులతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్ల నామినేషన్లు వచ్చాయి. అభ్యర్థులు రాత్రి వరకు లైన్‌లో ఉండి మరీ.. నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇది.. పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు ఓటర్లు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా లైన్‌లో ఉన్న తీరును తలపించింది. నామినేషన్ల గడువు సాయంత్రం 5 గంటలతో ముగియగా.. ఆ లోపు నామినేషన్‌ కేంద్రాల లోపలికి వచ్చినవారిని ఎంత ఆలస్యమైనా అనుమతించాలన్న నిబంధన ఉంది. దీంతో గడువు సమయం లోపు నామినేషన్‌ కేంద్రాల్లోకి వచ్చినవారు రాత్రి వరకు లైన్‌లో ఉండడం పలుచోట్ల కనిపించింది. ఒకేసారి వంద మంది వరకు రావడంతో మండల స్థాయిలోని అధికారులు ఊపిరి సలపని పనిలో పడిపోయారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని 4,236 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఆయా పంచాయతీల సర్పంచ్‌ పదవులకు తొలి రెండు రోజుల్లో 8,198 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు 3,297 నామినేషన్లు రాగా, రెండో రోజు శుక్రవారం 4,901 నామినేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజు సర్పంచులకు 20వేలకు పైగా, వార్డు సభ్యులకు 50వేలకు పైగా దాఖలయ్యాయి. రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో అర్ధరాత్రి 12.30 గంటల దాకా అధికారులు ఆ లెక్క తేల్చే పనిలోనే ఉన్నారు.


నేతల కనుసన్నల్లోనే నామినేషన్లు..

చివరిరోజు ప్రధాన రాజకీయ పార్టీల క్షేత్రస్థాయి నేతలంతా నామినేషన్ల పనిలోనే నిమగ్నమయ్యారు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతున్నా.. అది పేరుకు మాత్రమే. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు నామినేషన్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. మండల స్థాయి నేతలతోపాటు అవసరమైన చోట నేరుగా గ్రామస్థాయి నాయకులతోనూ మాట్లాడి.. తమ పార్టీ తరఫున సర్పంచ్‌ అభ్యర్థులుగా ఎవరు నామినేషన్లు వేయాలన్నది నిర్ణయించారు. ఒక్కోచోట ఒకరికి మించిన అభ్యర్థులు పార్టీ తరఫున సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి పోటీ ఉంటే సర్దుబాట్లు చేశారు. అదే సమయంలో తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీసీలకు ఎంత మందికి అవకాశం వచ్చిందన్నది కూడా నేతలు గమనంలోకి తీసుకున్నారు. అన్ని పార్టీల నేతలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో కొన్నిచోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులు మారారు. మొత్తంగా నామినేషన్ల ఘట్టం చివరి రోజు గ్రామస్థాయిలో రాజకీయ పార్టీల మధ్య సై అంటే సై అన్న వాతావరణం నెలకొంది. మరోవైపు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమకు పట్టున్న చోట్ల ఏకగ్రీవాల కోసం ప్రయత్నించారు. ఇక మొదటి విడతలో దాఖలైన నామినేషన్లను ఆదివారం పరిశీలించనున్నారు. అనంతరం డిసెంబరు 1, 2 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ఉంటుంది. డిసెంబరు మూడో తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అదేరోజు రాత్రి బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.


రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు..

రాష్ట్రంలో ఈసారి గ్రామ పంచాయతీలు రికార్డు స్థాయిలో ఏకగ్రీవం అవుతున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన శనివారం నాటికి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు వెల్లడైంది. వికారాబాద్‌ జిల్లాలో 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో 10 పంచాయతీలు ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో 8 పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 2019లో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ 18 పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. ఇక రంగారెడ్డి జిల్లాలో ఐదు పంచాయతీలను అక్కడి ప్రజలు ఏకగ్రీవం చేసుకున్నారు. కాగా, భూపాలపల్లి జిల్లాలో తొలి విడతలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ రెండూ కొత్తపల్లిగోరి మండలంలోనివే. ఇక వరంగల్‌ జిల్లాలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు, జగిత్యాల, కుమరం భీం జిల్లాల్లో ఒకటి చొప్పున పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. కాగా, , కరీంనగర్‌ జిల్లాలో ఒకే పంచాయతీ ఏకగ్రీవమైంది. చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో శివాలయం నిర్మించేందుకు అంగీకరించిన వడ్లకొండ తిరుమలను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు అంగీకరించారు. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రత్యేకించి గిరిజన తండాల్లో ఎక్కువగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇతర గ్రామాల్లో చాలా చోట్ల ఏకగ్రీవానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 ఏకగ్రీవమయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఐదు చోట్ల ఏకగ్రీవం కాగా, ఇందులో మిత్రపక్షాలైన


కాంగ్రెస్‌కు 4, సీపీఐకి ఒకటి దక్కాయి.

ఏకగ్రీవానికి అడ్డంకిగా వర్గపోరు

రాష్ట్రంలో ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్న పలు పంచాయతీల్లో రాత్రికి రాత్రే పరిణామాలు మారిపోయాయి. ప్రత్యేకించి గద్వాల జిల్లాలో వేలం పాటలో దక్కించుకున్న అన్ని గ్రామాలల్లో శనివారం నామిషన్లు దాఖలయ్యాయి. ఇందుకు వర్గపోరు ప్రధాన కారణం కగా, వేలంలో పాడిన డబ్బులు పూర్తిగా చెల్లించకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులపై గ్రామంలో చాలా మందికి ఇష్టం లేకపోవడం వంటి కారణాలతో నామినేషన్లను దాఖలు చేసినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో రెండో విడతలో జరగనున్న 4,333 సర్పంచ్‌లు, 33,350 వార్డుల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుంది. డిసెంబరు 2 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది.

‘ఎన్నికలను బహిష్కరిస్తాం’

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలంలోని నర్సాపూర్‌(బి) గ్రామ పంచాయతీ పరిధిలోని కుగ్రామమైన గొట్టికి చెందిన ప్రజలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి రాంప్రసాద్‌కు శనివారం వినతి పత్రం అందించారు. గొట్టి గ్రామంలో మూడు వార్డులు ఉండగా ఇక్కడ వంద శాతం ఓటర్లు ఎస్సీలు ఉన్నారు. అయితే ఈ వార్డులను ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. దీంతో ఇప్పటికైనా ఈ మూడు వార్డులను తమకే రిజర్వు చేయాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు.


ఆ 3 పంచాయతీల్లో నామినేషన్‌ నిల్‌

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం, వందూర్‌గూడ, వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో ఆ మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిలిచిపోనున్నాయి. గూడెం గ్రామంలో ఒక్కరు కూడా గిరిజనులు లేకపోయినా ఎస్టీలకు రిజర్వు చేశారు. 1987 నుంచి ఎస్టీకే కేటాయిస్తుండడంతో అప్పటినుంచీ గూడెం పంచాయతీకి ఎన్నికలు జరగడం లేదు. ఈసారీ కూడా ఇదే పరిస్ధితి రిపీట్‌ అయింది. ఇక నెల్కివెంకటాపూర్‌ పంచాయతీలో గతంలో వందూర్‌గూడ గిరిజన గ్రామం ఉండేది. 2019లో ఈ గ్రామాన్ని విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే దీనిని అక్కడి గిరిజనులు వ్యతిరేకించారు. తమ గ్రామాన్ని నెల్కివెంకటాపూర్‌లోనే కొనసాగించాలంటూ ఎవరూ నామినేషన్‌ వేయకుండా వదిలేశారు. మరోవైపు నెల్కివెంకటాపూర్‌ సర్పంచ్‌ స్థానాన్ని ఎస్టీకి కేటాయించగా.. అక్కడ ఎస్టీలు ఎవరూ లేరు. దీంతో ఆ గ్రామంలో కూడా ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది.

Updated Date - Nov 30 , 2025 | 06:32 AM