Srisailam Project Hits Historic High: శ్రీశైలం చరిత్రలోనే అత్యధిక వరద
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:43 AM
శ్రీశైలం ప్రాజెక్టుకు మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వరద నమోదైంది. ఈ సీజన్‌లో అంటే జూన్ 1 నుంచి ఇప్పటిదాకా 2105 టీఎంసీల వరద వచ్చింది....
జూన్ నుంచి ఇప్పటిదాకా ప్రాజెక్టులోకి 2105 టీఎంసీల ఇన్‌ఫ్లో
ఈ వాటర్ ఇయర్‌లో మరో 100 టీఎంసీలు వచ్చే అవకాశం
బంగాళాఖాతంలోకి 3905 టీఎంసీల గోదావరి జలాలు
హైదరాబాద్, గద్వాల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టుకు మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వరద నమోదైంది. ఈ సీజన్‌లో అంటే జూన్ 1 నుంచి ఇప్పటిదాకా 2105 టీఎంసీల వరద వచ్చింది. ఇది శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధిక వరద. శ్రీశైలం జలాశయానికి 1994-95లో 2039.23 టీఎంసీల వరద రాగా ఆ తర్వాత 2022-23లో 2039.87 టీఎంసీల వరద వచ్చింది. ఈ వాటర్ ఇయర్ (2025 జూన్ 1-2026 మే 31) పూర్తయ్యేనాటికి మరో 100 టీఎంసీల వరద రావొచ్చునని అంచనాలు వేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1578 టీఎంసీలు, జూరాలకు 1480 టీఎంసీల వరద వచ్చింది. కృష్ణా బేసిన్‌లో ఇప్పటిదాకా 1382 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయి. ఈ వాటర్ ఇయర్‌లో ఇప్పటిదాకా గోదావరి జలాలు 3,905 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1246 టీఎంసీల వరద రాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 822 టీఎంసీల వచ్చింది.
ప్రాజెక్టు రాతి ఫలకాల మధ్య పెలుసులు
శ్రీశైలం జలాశయం కింద భూగర్భంలోని భారీ రాతిఫలకాల మధ్య పెలుసులతో కూడిన బలహీన అతుకులున్నట్టు జియాలజికల్ సర్వే వెల్లడించగా... డ్యామ్ దిగువన ఏర్పడిన ప్లంజ్‌పూల్(భారీ గుంత) 120 మీటర్ల లోతు ఉందని 2018 జూలైలో నిర్వహించిన బాతోమెట్రిక్ సర్వేలోనూ తేలింది. డ్యామ్ పునాదుల లోతుకు గుంత లోతు మించిపోయినట్టు సమాచారం. గుంత.. డ్యామ్ పునాదుల వరకు విస్తరించి రాతిఫలకాల మధ్య పెలుసులతో ఉన్న జాయింట్ల(షీర్ జోన్)ను ప్రభావితం చేసి ఉండవచ్చునని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక తేల్చింది. శ్రీశైలం జలాశయం స్పిల్‌వేను గరిష్ఠంగా 19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మించారు. 2009 అక్టోబరులో 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. 78 గంటల పాటు భీకర వరద కొనసాగడంతో జలాశయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో జలాశయం కట్ట కుదుపునకు గురైంది. శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయినప్పటికీ, నిర్వహణను ఏపీ ప్రభుత్వమే చూస్తోంది. తెలంగాణ విజ్ఞప్తితో ఎన్‌డీఎ్‌సఏ, సీడబ్ల్యూసీలు ఈ ప్రాజెక్టు రక్షణ చర్యలకు ఉపక్రమించాయి. దాంతో ఏపీ ప్రభుత్వం కూడా వరద తగ్గిన తర్వాత ప్రాజెక్టుకు మరమ్మతులు చేసే అవకాశం ఉంది.