Outer Ring Road Land Scam: ప్రభుత్వభూమికి లెక్కలున్నాయా సారూ?
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:06 AM
దుండిగల్ భూదందాలో అన్నీ లోపాయికారీ ఒప్పందాలే. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మిన్నకుండి పోవడంతో.....
ఓఆర్‌ఆర్‌లో పోయిందెంత? రియల్టర్ గుంజుకుందెంత?.. ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణలోనూ గోల్‌మాల్ దందా
రూ.120 కోట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్న రియల్టర్
పట్టా భూమి కింద ఇవ్వాల్సిన భూమికి ప్రభుత్వ భూమి జమ
దుండిగల్ భూదందాలో మాయ.. నిగ్గుతేల్చనున్న సర్కారు
‘రూ.2వేల కోట్ల భూదందా’పై సీఎంవోకు ప్రాథమిక నివేదిక
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్ర జ్యోతి): దుండిగల్ భూదందాలో అన్నీ లోపాయికారీ ఒప్పందాలే. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మిన్నకుండి పోవడంతో.. విలువైన భూములను రియల్టర్లు దక్కించుకున్నారు. ఓఆర్‌ఆర్ భూసేకరణకు ప్రభుత్వ భూములతోపాటు పట్టా భూములను కూడా సేకరించినప్పటికి.. పట్టా భూములను కాపాడుకున్న పెద్ద మనుషులు.. వారి భూములకు బదులుగా ప్రభుత్వ భూములనే పణంగా పెట్టారు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి 2023 ఫిబ్రవరిలో అప్పటి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ రాసిన లేఖలో (ఏవోఎల్‌ఆర్ /416/1975: తేదీ 22-2-2023) దుండిగల్ గండి మైసమ్మ మండలంలో సర్వే నంబరు 322, 323, 324, 325, 326, 327, 359, 360, 361, 362, 423, 424, 425, 426 పరిధిలో ఓఆర్‌ఆర్ భూసేకరణకు ప్రభుత్వ భూమి ఎంత తీసుకున్నారు? పట్టా భూమి ఎంత తీసుకున్నారు అనే వివరాలను స్పష్టం చేశారు. అదే లేఖలో ఓఆర్‌ఆర్‌కు, పంచాయతీ రోడ్లకు, ఇతర స్వచ్ఛంద సంస్థలకు కేటాయించిన భూమి పోగా ఉన్న భూమిలో.. ప్రభుత్వ భూమి ఎంత ఉంది? పట్టా భూమి ఎంత? అనే వివరాలను సైతం సర్వే నంబర్లవారీగా పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్, పంచాయతీ రోడ్ల కోసం 6.38 ఎకరాల పట్టా భూమి.. 12.26 ఎకరాల ప్రభుత్వ భూమి సేకరించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపిన లేఖలో పేర్కొన్నారు. మొత్తం సర్వే నంబర్లలో 102 ఎకరాల సీలింగ్, 82 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి. ప్రభుత్వ భూమిలో ఓఆర్‌ఆర్ కోసం 11 ఎకరాలు, పంచాయతీ రోడ్డు కోసం 1.26 ఎకరాలు కలిపి 12.26 ఎకరాలు సేకరించారు. అలాగే 102 ఎకరాల పట్టా భూముల్లో 6.38 ఎకరాలు ఓఆర్‌ఆర్ కోసం సేకరించారు. అయితే రియలర్టర్ తనకున్న రాజకీయ అండదండలతో తన వాటాగా ఓఆర్‌ఆర్ కోసం కేటాయించిన 6.38 ఎకరాలను వదులుకోకుండా.. పట్టా భూముల నుంచి సేకరించాల్సిన వాటాను సైతం ప్రభుత్వ భూముల్లోనే చూపారు.
దీంతో రియల్టర్ సంస్థకు ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఎకరా రూ.20 కోట్ల చొప్పున 6.38 ఎకరాలకు సుమారు రూ.120 కోట్ల అయాచిత లబ్ధి చేకూరినట్లైంది. అంత మేర ప్రభుత్వ భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వే నంబరు 423/1లో 5.37 ఎకరాల పట్టా భూమి ఉండగా అందులో ఓఆర్‌ఆర్ కోసం 1.15 ఎకరాలు ఇవ్వాలి. 424/1లో 5-12 ఎకరాలు ఉండగా అందులో 4-22 ఎకరాలు, సర్వే నంబరు 425/1లో 6-14 ఎకరాల్లో 1.01 ఎకరాలు ఓఆర్‌ఆర్ భూసేకరణలో కేటాయించారు. మొత్తం 6-38 ఎకరాల పట్టా భూమిని కేటాయించారు. సీలింగ్ ల్యాండ్‌కు సంబంధించి సర్వే నంబరు 325/2లో 6-37 ఎకరాలు ఉండగా అందులో 0.32 గుంటలు, సర్వే నంబరు 359/2లో 5-38 ఎకరాల్లో 3-31 ఎకరాలు, సర్వే నంబరు 360/2లో 5-16 ఎకరాల్లో 1-06 ఎకరాలు, సర్వే నంబరు 423/2లో 5-36 ఎకరాల్లో 4-34 ఎకరాలు, సర్వే నంబరు 424/2లో 5-23 ఎకరాల్లో 0.17 గుంటలు ఇలా 11 ఎకరాలు, పంచాయతీ రోడ్డు కోసం 1.26 ఎకరాలు కలిపి 12.26 ఎకరాలు ఓఆర్‌ఆర్ భూసేకరణకు కేటాయించారు. మొత్తం మీద 18.64 ఎకరాలు ఓఆర్‌ఆర్‌కు కేటాయించారు. ఈ కేటాయింపులపై ప్రత్యేక రంగుల్లో స్కెచ్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లిప్తంగా ఉండటంతో.. పట్టా భూముల స్థానంలో కూడా ప్రభుత్వ భూములనే ఓఆర్‌ఆర్ భూసేకరణలో కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 82 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం నిర్దిష్టంగా ప్రభుత్వ ఖాతాలో ఎంత ఉందనే లెక్కలు ఇప్పుడు తీస్తున్నారు.
సీఎంవోకి నివేదిక
‘‘రూ.2000 కోట్ల భూ దందా’’ అనే శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితం అయిన కథనంపై సీఎంవో అధికారులు నివేదిక కోరినట్లు తెలిసింది. దీంతో.. మేడ్చల్ కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ప్రాథమిక వివరాలతో నివేదిక పంపినట్లు సమాచారం. సీలింగ్ ఫైల్‌ను ‘కన్సాలిడేషన్ ఎక్సర్‌సైజ్’ పేరుతో ఎందుకు తెరవాల్సి వచ్చింది? ఆ తరువాత జరిగిన పరిణామాలు.. సీసీఎల్‌ఏ ఉత్తర్వులు తదితర అంశాల గురించి ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. భూముల కేటాయింపుపై పునఃపరిశీలన చేయాలని సీసీఎల్‌ఏ నుంచి మెమో వస్తే పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సీలింగ్ చట్టం కింద మూసి వేసిన ఫైల్‌ను తిరిగి తెరవాలంటే కొన్ని సందర్భాలలోనే ఆ అవకాశం ఉంటుందనేది రెవెన్యూ అధికారుల వాదన. ఫైల్ ఒకసారి మూసి వేసిన తరువాత అదే ఫైల్‌కు సంబంధించి కొత్త ఆధారాలతో ప్రామాణిక పత్రాలు దొరికినా, సర్వే నంబర్లు, విస్తీర్ణం నమోదులో పొరపాట్లు జరిగినా, వారసత్వ పత్రాలు తొలుత ఇవ్వలేకపోయినవారు తరువాత ఇచ్చినా, కోర్టు ఆదేశాలు, సీలింగ్ చట్టంలో అధికారులు చేసిన పొరపాట్లు గుర్తించినా.. ఫైల్ తిరిగి తెరిచేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇవేమీ లేకుండానే దుండిగల్ ఫైల్‌ను ఓ రియల్టర్ ప్రయోజనాల కోసం కన్సాలిడేషన్ ఎక్సర్‌సైజ్ పేరుతో తెరిచి.. ఆ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చడం చర్చనీయాంశం అయింది.