Share News

Family Feud: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:20 AM

ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని ఆరుగురు దుండగులు కాపుగాసి కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారు.....

Family Feud: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య

  • కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

  • కాప్రాలో ఘటన.. పాతకక్షలే కారణం

  • హత్యలో ఆరుగురి ప్రమేయం

హైదరాబాద్‌ సిటీ/మౌలాలీ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని ఆరుగురు దుండగులు కాపుగాసి కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారు. శుక్రవారం ఉదయం 7:55 గంటలకు హైదరాబాద్‌లోని కాప్రాలో ఈ ఘటన జరిగింది. హతుడు 54 ఏళ్ల వెంకటరత్నం. పాతికేళ్ల నాటి పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. వెంకటరత్నానికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాప్రాలోని సాకేత్‌ కాలనీ పోస్టర్‌ స్కూల్‌ సమీపంలో దాదాపు 500 గజాల స్థలంలో అతడు ఇల్లు కట్టుకున్నాడు. వెంకటరత్నం కుటుంబం, అతడి తమ్ముడి కుటుంబం, తల్లి ఆ ఇంట్లోనే ఉమ్మడిగా నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం చిన్న కుమార్తెను బడిలో దిగబెట్టిన తర్వాత స్కూటీపై తిరిగివస్తున్న వెంకటరత్నాన్ని ది గ్రిడ్‌ పికిల్‌ బాల్‌ కోర్డు సమీపంలో ఆరుగురు అడ్డుకున్నారు. దుండగుల్లో ఇద్దరు బైక్‌పై, మరో నలుగురు ఆటోలో వచ్చి కాపుగాశారు. వెంకటరత్నం సమీపంలోకి రాగానే చుట్టుముట్టి విచక్షణరాహితంగా దాడి చేసి చంపారు. తీవ్రగాయాలతో వెంకటరత్నం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా హతుడు వెంకటరత్నం 24 ఏళ్ల క్రితం ధూల్‌పేటకు చెందిన సుధేశ్‌ సింగ్‌ అనే వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. సుధేశ్‌ ఆర్థిక వ్యవహారాలనూ చూసేవాడు. అక్కడ జరిగిన హత్యలు, గంజాయి కేసులు, ఇతర గ్యాంగులతో వెంకటరత్నానికి కూడా వివాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో 2001లో జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో సుధేశ్‌ సింగ్‌ చనిపోయాడు. ఆ తర్వాత సుదేశ్‌ సింగ్‌ కుటుంబం నుంచి వెంకటరత్నం దూరంగా వెళ్లిపోయాడు. సుదేశ్‌ సింగ్‌ కుటుంబసభ్యులకు వెంకటరత్నం పాత్రపై అనుమానాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వెంకటరత్నంపై సుదేశ్‌సింగ్‌ కుమారుడు పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో కాప్రాలో నివాసం ఉంటున్న వెంకటరత్నం రోజువారీ కార్యకలాపాలపై రెక్కీ నిర్వహించి.. చంపేశాడు. హత్య తర్వాత.. ‘నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాను’ అంటూ ఆరుగురిలో ఒకరు అరుచుకుంటూ వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. తల, మెడ, పొట్ట భాగాల్లో తీవ్రగాయాలతో వెంకటర్నం మృతిచెందాడని మల్కాజిగిరి డీసీపీ సీ.శ్రీధర్‌ పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలతో హత్య ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షల కారణంగానే అతడిని ప్రత్యర్థులు చంపి ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. హత్య ఘటనలో పాల్గొన్న ఆరుగురు నిందితులు జవహర్‌నగర్‌ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.

Updated Date - Dec 09 , 2025 | 04:20 AM