Share News

Real Estate Business Dispute: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య

ABN , Publish Date - Sep 13 , 2025 | 04:37 AM

ఇద్దరూ ఒకరికొకరు తెలిసినవారే! కానీ..వ్యాపార, ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా వారిలో ఒకరు మరొకరిని నడిరోడ్డుపై పొడిచి పొడిచి....

Real Estate Business Dispute: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య

  • తెలిసిన వ్యక్తే నడిరోడ్డుపై పొడిచి చంపిన వైనం

  • హైదరాబాద్‌ కుషాయిగూడలో ఘోరం

ఏఎ్‌సరావునగర్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఇద్దరూ ఒకరికొకరు తెలిసినవారే! కానీ.. వ్యాపార, ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా వారిలో ఒకరు మరొకరిని నడిరోడ్డుపై పొడిచి పొడిచి చంపాడు! హైదరాబాద్‌లోని కుషాయిగూడ హెచ్‌బీ కాలనీలో శుక్రవారం జరిగిందీ దారుణం. ఆ కాలనీకి చెందిన పి.శ్రీకాంత్‌రెడ్డి (45)... రియల్‌ ఎస్టేట్‌తోపాటు ఫైనాన్స్‌ వ్యాపారం కూడా చేసేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిత్యం తన వెన్నంటి ఉండే ధన్‌రాజ్‌ (40) అనే వ్యక్తితో శ్రీకాంత్‌రెడ్డికి కొంతకాలంగా విభేదాలున్నాయి. అవి ఒకరిపై ఒకరు కక్ష పెంచుకునే స్థాయికి చేరుకున్నాయి. ఆ విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇద్దరూ మంగాపురంలోని శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంలో కలుసుకుని.. మద్యం తాగారు. మత్తులో మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగినట్టు సమాచారం. వాగ్వాదం కాస్తా కొట్టుకునేదాకా వెళ్లి ఇద్దరూ పెనుగులాడుతూ కార్యాలయంలోంచి బయటకు వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తిని బయటకు తీసిన ధన్‌రాజ్‌.. దాంతో శ్రీకాంత్‌రెడ్డిని విచక్షణరహితంగా పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోబోయిన ఓ వ్యక్తిని సైతం బెదిరించాడు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది శ్రీకాంత్‌రెడ్డిని సీపీఆర్‌ చేసి కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కుషాయిగూడ పోలీసులు జరిగిన ఘటనపై ఆరా తీశారు. శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ధన్‌రాజ్‌ను మౌలాలి జడ్‌టీఎస్‌ చౌరస్తాలో అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. కాగా.. షాపింగ్‌ వెళ్దామని శ్రీకాంత్‌రెడ్డి తన భార్య అపర్ణకు ఫోన్‌ చేయగా.. పిల్లలకు పరీక్షలు ఉన్నాయని తర్వాత వెళ్దామని ఆమె చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయన తన కార్యాలయంలోనే ఉండిపోయారని.. షాపింగ్‌కు వెళ్లి ఉంటే ఇలా హత్యకు గురయ్యేవారు కాదని స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - Sep 13 , 2025 | 04:37 AM