RBI Governor Sanjay Malhotra: తెలంగాణ ఆర్థిక విధానాలు భేష్!
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:03 AM
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బాగున్నాయంటూ ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఆర్‌బీఐ బోర్డు మీటింగ్ హాజరయ్యేందుకు..
మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకెళ్లండి..
సీఎం రేవంత్‌తో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బాగున్నాయంటూ ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఆర్‌బీఐ బోర్డు మీటింగ్ హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన.. గురువారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పలు సంస్కరణలను సంజయ్‌కు వివరించారు. విద్యుత్తు రంగంలో చేపట్టిన సంస్కరణలు, మూడో డిస్కమ్ ఏర్పాటుతో పాటు సోలార్ విద్యుత్తు వినియోగం పెంచే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. అనంతరం మల్హోత్రా మాట్లాడుతూ.. బడ్స్ యాక్ట్ (అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధ చట్టం) ను నోటిఫై చేయాలని సీఎంను కోరారు. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. యూనిఫైడ్ లెర్నింగ్ ఇంటర్‌ఫేజ్ (యూఎల్‌ఐ) విషయంలో ఆర్‌బీఐ తీసుకుంటున్న చొరవ గురించి సీఎంకు వివరించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల క్యాంపెయినింగ్ గురించి కూడా వెల్లడించినట్లు సీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా, ఆర్‌బీఐ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ చిన్మోయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.