Share News

Revenue Department: రేషన్‌ కార్డు ఉంటేనే.. ఆదాయ ధ్రువీకరణ పత్రం

ABN , Publish Date - Nov 16 , 2025 | 06:11 AM

విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు పొందాలన్నా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయాలన్నా..

Revenue Department: రేషన్‌ కార్డు ఉంటేనే.. ఆదాయ ధ్రువీకరణ పత్రం

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల్లో అనర్హులను అడ్డుకోవాలని సర్కార్‌ నిర్ణయం

  • అమల్లోకి వచ్చిన కొత్త విధానం

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు పొందాలన్నా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయాలన్నా.. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంటును భారీగా అనర్హులు పొందుతున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. రాష్ట్ర సర్కార్‌ చర్యలకు ఉపక్రమించింది. అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుకు రేషన్‌ కార్డును అనుసంధానించింది. దీంతో రేషన్‌ కార్డు ఉంటేనే ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలంటే మీసేవ కేంద్రాల్లో రెండు విధానాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. రేషన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం ఉన్నందున.. ఆధార్‌ నెంబరు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవడం ఒక విధానం. రేషన్‌ కార్డు ఉంటే దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబంగా ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి.. ఈ విధానంలో దరఖాస్తు చేసిన తర్వాత ఎలాంటి విచారణ లేకుండానే రెవెన్యూ అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. రేషన్‌ కార్డులు లేనివారు సైతం దరఖాస్తు చేసే అవకాశం కూడా ఉండేది. ఈ విధానంలో ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలంటే రెవెన్యూ అధికారుల క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరి. అయితే ఇలాంటి దరఖాస్తులు పెద్దఎత్తున వస్తుండటంతో ఎలాంటి విచారణ లేకుండానే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


ముఖ్యంగా రేషన్‌ కార్డు లేని దరఖాస్తుదారుల నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో రూ.2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఉపకారవేతనాలు, సంక్షేమ పథకాల్లో అనర్హులు ఇక్కడినుంచే పుట్టుకొస్తున్నారని అధికారవర్గాలు ఇప్పటికే గుర్తించాయి. ఈ నేపథ్యంలో అనర్హులను అడ్డుకోవడానికి కొత్త విధానాన్ని ఎలాట్రానిక్ సర్వీస్‌ డెలివరీ (మీసేవ) విభాగం మూడు రోజుల నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ ప్రక్రియతో రేషన్‌ కార్డు లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే ‘మిస్సింగ్‌ ఫుడ్‌ సెక్యూరీటీ కార్డు’ అని సందేశం వస్తుంది. ఈ విధానంతో అనర్హులకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా రేషన్‌ కార్డు పొందిన తర్వాతే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Updated Date - Nov 16 , 2025 | 06:13 AM