Tummala Nageswara Rao: కొత్తగూడెంలో అరుదైన ఖనిజ సంపద
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:39 AM
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ సంపద లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ...
అందుకే ఎర్త్‌సైన్స్ వర్సిటీ ఏర్పాటు: తుమ్మల
రేపు ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
ఖమ్మం కార్పొరేషన్/ కొత్తగూడెం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ సంపద లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అందుకే కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనకు అత్యుత్తమ ప్రదేశంగా నిలిచిందన్నారు. డిసెంబరు 2న ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొత్తగూడెంలోని ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆదివారం ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. భూగోళ శాస్త్రాలు, సహజ వనరులు, ఖనిజ పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా నిలిచేలా దేశంలోనే ప్రత్యేకత కల ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గౌరవిస్తూ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించాయని తెలిపారు. జాతీయ రహదారి పక్కనే అభివృద్ధి చెందుతున్న ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థగా నిలవనుందన్నారు. గడువు పూర్తి కావడంతో పాల్వంచలో తొలగించిన విద్యుత్ కేంద్రాల స్థానే.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్యం తక్కువగా ఉండే విధంగా కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని పేర్కొన్నారు.
బీమా వ్యతిరేక విధానాలను తిప్పి కొడతాం
కేంద్ర ప్రభుత్వ బీమా వ్యతిరేక విధానాలను తిప్పి కొడతామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రపంచంలోకెల్లా నమ్మకమైన సంస్థగా ఎల్‌ఐసీ గుర్తింపు పొందిందన్నారు. కమీషన్ తగ్గింపు ద్వారా ఎల్‌ఐసీ ఏజెంట్ల వ్యవస్థతోపాటు పరోక్షంగా బీమా సంస్థను దెబ్బ తీయాలని చూస్తోందని ఆదివారం ఖమ్మంలో జరిగిన ఎల్‌ఐసీ ఏజెంట్ల సమాఖ్య 7వ మహాసభలో ఆయన చెప్పారు. కేంద్ర మంత్రితో మాట్లాడి ఏజంట్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్‌ఐసీని పరిరక్షించుకునేందుకు రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాలన్న తుమ్మల.. అందుకు తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.