Rare Disease: ఐదేళ్ల గిరిజన బాలుడికి అరుదైన వ్యాధి
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:46 AM
ఐదేళ్ల బాలుడు.. ఆడిపాడే వయసులో లక్షమందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాదపడుతున్నాడు. చికిత్సకు కోట్లలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో రెక్కాడితే....
లక్షమందిలో ఒకరికి వచ్చే ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’
చికిత్సకు రూ.కోట్లలో ఖర్చు.. మందులూ ఖరీదే
ఆందోళనలో తల్లిదండ్రులు.. సర్కార్ ఆదుకోవాలని విజ్ఞప్తి
బొంరా్‌సపేట్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల బాలుడు.. ఆడిపాడే వయసులో లక్షమందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాదపడుతున్నాడు. చికిత్సకు కోట్లలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో రెక్కాడితే గానీ డొక్కాడని ఆ నిరుపేద గిరిజన తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బాధిత బాలుడు వికారాబాద్ జిల్లా బోంరా్‌సపేట్ మండలం వడిచర్ల గ్రామ పరిధిలోని ఉరెన్కితండాకు చెందిన జగన్ (5). కొన్నాళ్లుగా బాలుడు సరిగా నడవలేకపోతుండటం, కూర్చోవడం, నిల్చోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి జగన్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్ యాదవ్, బోంరా్‌సపేట్ మండల వైద్యాధికారి హేమంత్ సోమవారం బాధిత కుటుంబాన్ని బోంరా్‌సపేట్ ప్రభుత్వాస్పత్రికి పిలిపించారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యాధి నివారణకు ఆరోగ్యశాఖ వద్ద ఎటువంటి మందులు అందుబాటులో లేవని, ఈ వ్యాధికి ముందులు ఖరీదైనవి అని.. ప్రైవేట్‌లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బాధిత కుటుంబం పరిస్థితిని కలెక్టర్ ద్వారా ఉన్నతస్థాయి అధికారులకు చేరవేస్తామని చెప్పారు. ప్రభుత్వపరంగా నిమ్స్, నిలోఫర్ ఆస్పత్రుల్లో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే వైద్యం ప్రారంభిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, వైద్యశాఖ పరంగా అండగా ఉంటామన్నారు. కాగా తమ చిన్నారికి వ్యాధి నయం అయ్యే విధంగా ప్రభుత్వం ఆదుకొని చికిత్స చేయించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.