Police Investigation: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:06 AM
ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.
ఆయన డ్రగ్స్ వాడినట్టు గుర్తించిన ఈగిల్ టీమ్
అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఈగిల్ బృందానికి పట్టుబడిన డ్రగ్ పెడ్లర్ల్లను విచారించిన క్రమంలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. వారం క్రితం హైదరాబాద్‌లోని ట్రూప్ బజార్‌కు చెందిన డ్రగ్ పెడ్లర్లు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింగ్వీని పోలీసులు అరెస్టు చేసి, 43 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినవారి వివరాలను రాబట్టిన పోలీసులు.. అందులో అమన్‌ప్రీత్, ఆయన స్నేహితులు కూడా ఉన్నట్టు తేల్చారు. డ్రగ్స్ వ్యవహారంలో అమన్‌ప్రీత్ పాత్రను గుర్తించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది నార్సింగి పరిధిలో పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాలోనూ అమన్‌ప్రీత్ కీలకమని గుర్తించారు. ఆయనకు పరీక్షలు చేసి డ్రగ్స్ వినియోగించినట్టు తేల్చారు. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వ్యవహారంలో ఆయన పేరు బయటికి వచ్చింది. అమన్‌ప్రీత్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయని, ఆయన చిక్కితే సినీ పరిశ్రమకు చెందిన మరికొందరి పేర్లు బయటికొచ్చే అవకాశం ఉందని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఈ ముఠాలో ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.