Share News

Defending Secularism: దేశాన్ని మతప్రాతిపదికనవిభజించడమే..

ABN , Publish Date - Nov 10 , 2025 | 03:26 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అంటే ముస్లింలు అని ఆయన అన్నారని...

Defending Secularism: దేశాన్ని మతప్రాతిపదికనవిభజించడమే..

  • ‘కాంగ్రెస్‌ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్‌’ అంటారా?

  • రేవంత్‌ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ మండిపాటు

  • ఇదీ కాంగ్రెస్‌ సంస్కృతి.. అంటూ బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ఆగ్రహం

ఔరంగాబాద్‌, నవంబరు 9: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌ అంటే ముస్లింలు’ అని ఆయన అన్నారని, ఇది దేశాన్ని మతప్రాతిపదికన విభజించడమేనని చెప్పారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన ఆదివారం ఆయన ఔరంగాబాద్‌, ససరాంల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ‘తెలంగాణ సీఎం చెప్పింది విన్నారా? కాంగ్రెస్‌ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్‌ అని ఆయన అన్నారు. దీని అర్థం ఏమిటి? మత ప్రాతిపదికన దేశాన్ని విభజించే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఇవేమి రాజకీయాలు? ఇదీ కాంగ్రెస్‌ సంస్కృతి’ అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి గురువారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఆ వ్యాఖ్య చేశారు. ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించగా, దానికి సమాధానం ఇచ్చిన రేవంత్‌ ఆ మాటలు అన్నారు. దాన్నే రాజ్‌నాథ్‌ సింగ్‌ బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. కాంగ్రె్‌సవి విభజనపూరిత, బుజ్జగింపు రాజకీయాలని విమర్శించారు. బీజేపీ మాత్రం మానవీయ రాజకీయాలను చేస్తోందని చెప్పారు. ఆర్జేడీ నేత లాలు ప్రసాద్‌ను కూడా ఆయన విమర్శించారు. ‘జబ్‌ తక్‌ రహేగా సమోసా మే ఆలూ తబ్‌ తక్‌ రహేగా బిహార్‌ మే లాలు’ (సమోసాలో ఎంతవరకు బంగాళాదుంప ఉంటుందో అంతవరకు బిహార్‌లో లాలూ ఉంటారు) అంటూ గతంలో లాలు చేసిన వ్యాఖ్యను ప్రస్తావించారు. ఇప్పుడు సమోసాలో ఆలూను అంతగా పెట్టడం లేదని, జీడిపప్పు ఇతర రుచికరమైన పదార్థాలను పెడుతున్నారని అన్నారు. అందువల్ల ఆ మాటకు కాలం చెల్లిందని చెప్పారు. ఎన్‌డీఏ రుచికరమైన సమోసాలను అందిస్తుందని అన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఇచ్చిన హామీని తప్పు పట్టారు. ఆయనకు లెక్కలేమైనా తెలుసా? జీతాలకు ఎక్కడ నుంచి డబ్బులు తీసుకొస్తారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ...ఆయనకు నిజంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలపై అంత శ్రద్ధ ఉంటే ప్రతిపక్ష నేత పదవిని ఆయా వర్గాల వారికి అప్పగించాలని డిమాండు చేశారు.

Updated Date - Nov 10 , 2025 | 03:26 AM