Rajnath Singh: రజాకార్లు.. పహల్గాం ఉగ్రవాదులు.. ఇద్దరూ ఒక్కటే!
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:20 AM
భారతదేశ చరిత్రలో ఆపరేషన్ పోలో కీలక ఘట్టమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘భారత్ ఐక్యతను దెబ్బతీసేవారికి పరాజయం తప్పదని తేల్చిచెప్పిన రోజు సెప్టెంబరు 17.....
భారత్‌ను సమర్థించేవారందరికీ రజాకార్లు శత్రువులే
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
కర్ణాటకలో విముక్తి దినాన్ని నిర్వహిస్తున్నారు
ఇక్కడెందుకు నిర్వహించరు?
కాంగ్రెస్ ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి సూటి ప్రశ్న
నిజాం పాలనలో ‘జలియన్ వాలాబాగ్’ తరహా ఉదంతాలు ఎన్నో: బండి సంజయ్
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భారతదేశ చరిత్రలో ‘ఆపరేషన్ పోలో’ కీలక ఘట్టమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘భారత్ ఐక్యతను దెబ్బతీసేవారికి పరాజయం తప్పదని తేల్చిచెప్పిన రోజు సెప్టెంబరు 17. ఆపరేషన్ పోలో.. ఒక సైనిక చర్య మాత్రమే కాదు.. హైదరాబాద్ సంస్థానంలో హిందువులపై అకృత్యాలకు ముగింపు పలికిన రోజు’ అని అన్నారు. దేశంలో ఇప్పటికీ రజాకార్లు ఉన్నారని, వారే మన ప్రధాన శత్రువులని వ్యాఖ్యానించారు.బుధవారం పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్‌నాథ్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘రజాకార్లు హిందువులకే కాదు.. భారత్‌ను సమర్థించే ప్రతీ ఒక్కరికి శత్రువులే. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని స్పష్టం చేసినందుకు ఉర్దూ పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ చేతులు నరికారు’ అని గుర్తు చేశారు. ‘రజాకార్లు, పహల్గాం ఉగ్రవాదులు ఇద్దరూ ఒక్కటే.. ఇద్దరూ మతం అడిగి మరీ హత్యాకాండకు పాల్పడ్డారు. నాడు సర్దార్ పటేల్ రజాకార్ల అకృత్యాలను ఎలా అంతమొందించారో, ఇప్పుడు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను, వారి ఏజెంట్లను మోదీ ప్రభుత్వం అంతు చూస్తోంది. వేలాది సంవత్సరాల భారతీయ సంస్కృతిపై దాడికి పాల్పడ్డవారిని తుదముట్టించేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టింది’ అని ఆయన వివరించారు.
సిందూర్ ముగియలేదు
ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని, ఉగ్రవాదులు మళ్లీ దాడిచేస్తే తిరిగి ప్రారంభిస్తామని రాజ్‌నాథ్‌సింగ్ పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్‌తో కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబం ఛిన్నాభిన్నమైందంటూ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించడం మన సైన్యం పరాక్రమానికి నిదర్శనం అని ప్రశంసించారు. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినంగా ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్దార్ పటేల్ రాజనీతిజ్ఞుడే కాదు.. యుద్ధతంత్రంలో కూడా నిపుణుడని తెలిపారు. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ నాడు ఢిల్లీలో సర్దార్ పటేల్‌ను కలుసుకుని, చివరి వరకూ పోరాడుతాం.. మరణిస్తాం... కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్‌తో కలువబోం అని చెప్పినప్పుడు ‘మీరు ఆత్మహత్య చేసుకుంటే మేమెలా అడ్డుకోగలం’ అంటూ పటేల్ తనదైన శైలిలో హెచ్చరించారని రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు.
అధికారికంగా ఎందుకు నిర్వహించరు
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. హైదరాబాద్ ముక్త్ దివ్‌సను నిర్వహిస్తుంటే, ఇక్కడెందుకు నిర్వహించరు? ఏం రోగమొచ్చింది? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిలదీశారు. ‘హైదరాబాద్ సంస్థానంలో నాడు రజాకార్ల దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు పటేల్ చొరవతో భారత సైన్యం యుద్ధం జరిపి ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించింది. అటువంటి ఘనచరిత్ర గురించి పాలకపక్షాలు ఈ తరానికి తెలియకుండా దుర్మార్గంగా తొక్కిపెట్టాయి. పాఠ్యాంశాల్లో లేకపోవడం, విద్యార్థులకు కళాశాలల్లో చెప్పకపోవడం దారుణం. హైదరాబాద్ ముక్తి దివ్‌సకు పేర్లు మార్చి, అమరవీరుల త్యాగాలను, ఫలితాలను, ఆకాంక్షలను అవమానిస్తున్నారు? ఒకవర్గం ఓట్ల కోసం, ఎంఐఎంకు భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. నిజాం నిరంకుశ పాలనకు తెరదించిన రోజు సెప్టెంబరు 17 అని, నాటి ఆపరేషన్ పోలోలో తన కుటుంబసభ్యులు కూడా పాల్గొనడం గర్వంగా భావిస్తున్నానని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
నిజాం పాలనలో ఎన్నో జలియన్ వాలాబాగ్’లు: బండి సంజయ్
నిజాం పాలనలో ‘జలియన్ వాలాబాగ్’ తరహా మారణకాండలు ఎన్నో జరిగాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జాతీయ జెండాను ఎగరేశారనే కారణంతో పరకాలలో 1500 మందిని కాల్చి చంపారని తెలిపారు. జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచం ముందుంచిన చరిత్రకారులు... అంతకు మించిన పరకాల దురాగతాన్ని, బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లి, వెయ్యిఊడలమర్రి ఘటనల్లో రజాకార్ల రాక్షసత్వాన్ని మాత్రం విస్మరించడం దారుణమన్నారు.
వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కంటోన్మెంటు పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.