Rahul Gandhi: దసరా తర్వాత డీసీసీ అధ్యక్షుల నియామకం
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:14 AM
రాష్ట్రంలోని 35 డీసీసీలకు అధ్యక్షుల నియామక ప్రక్రియ.. దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఈ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు అధిష్ఠానం.. 22 మంది ఏఐసీసీ...
నేడు ఢిల్లీలో రాహుల్ దిశానిర్దేశం
రాష్ట్రంలోని 35 డీసీసీలకు అధ్యక్షుల నియామక ప్రక్రియ.. దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఈ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు అధిష్ఠానం.. 22 మంది ఏఐసీసీ పరిశీలకులను నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంతో పాటు రాజస్థాన్, ఛత్తీ్‌సగడ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కోసం కూడా అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. వీరందరికి, అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై అవగాహన కోసం గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో అధిష్ఠానం ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ పాల్గొననున్నారు. కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నియామక ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసీసీ పరిశీలకులు అక్టోబర్ 4 నుంచి పది రోజుల పాటు వారు క్షేత్రస్థాయిలో పర్యటించి.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై స్థానిక నాయకుల అభిప్రాయాలను సేకరించి, సమగ్ర నివేదికను అధిష్ఠానానికి సమర్పిస్తారు. పరిశీలకులు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర నాయకత్వాన్నీ సంప్రదించి.. డీసీసీ అధ్యక్షులను అధిష్ఠానం ప్రకటించనుంది.