Share News

Jagga Reddy: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాహుల్‌గాంధీ కుటుంబానిది

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:01 AM

దేశం కోసం ఆస్తులతోపాటు ప్రాణాలనూ త్యాగం చేసిన చరిత్ర రాహుల్‌ గాంధీ కుటుంబానికి ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు...

Jagga Reddy: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాహుల్‌గాంధీ కుటుంబానిది

  • లక్ష్మణ్‌.. ఏం చేశారని ఎంపీ పదవి తీసుకున్నారు?.. కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం

  • మోదీ పాలనపై చర్చకు మీరు సిద్దమా?

  • ఎఫ్‌సీఐతో నెహ్రూ.. పేదల ఆకలి తీర్చిండు

  • ఇందిర పాలనలో బ్యాంకుల జాతీయం

  • భూములను పేదలకు పంచి పెట్టారు

  • 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన రాజీవ్‌

  • 12 ఏళ్లలో మోదీ, షా ఏం చేశారు?

  • దొంగ ఓట్లతోనే కదా మీరు గెలిచింది

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘దేశం కోసం ఆస్తులతోపాటు ప్రాణాలనూ త్యాగం చేసిన చరిత్ర రాహుల్‌ గాంధీ కుటుంబానికి ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌ కుటుంబానికి మూడు ఎంపీ పదవులు అవసరమా? అంటూ బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. దేశం కోసం ఏం చేశావని ఎంపీ సహా ఇతర పదవులను తీసుకున్నావు? అని లక్ష్మణ్‌ను ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, మోదీ 11 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు లక్ష్మణ్‌ సహా బీజేపీ నేతలు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రావడం.. రాకపోవడం అనేది వేరే విషయమని, కానీ చరిత్రను ఎవరూ కాదనలేరన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి ప్రధానిగా ఉన్న నెహ్రూ.. ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసి కరువు కాలంలోనూ పేదలకు బియ్యం అందించే ఏర్పాటు చేశారన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పెత్తందారుల భూమిని పేదలకు పంచారని, బ్యాంకులను జాతీయం చేశారని కొనియాడారు. బాలానగర్‌లో ఐడీపీఎల్‌సహా అనేక సంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని, దేశంలో ఐటీ రంగ అభివృద్ధికీ బీజం వేశారని చెప్పారు. పీవీ నర్సింహారావును ప్రధానిని చేసిందీ కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కూడా నెహ్రూ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేశారని, కాంగ్రెస్‌ నాయకుడైన ఆయనను.. బీజేపీ నేతలు తమ వాడని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. సోనియా, రాహుల్‌కు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. రెండు సార్లూ మన్మోహన్‌ సింగ్‌నే ప్రధానిని చేశారని గుర్తుచేశారు.


ఉపాధి హామీ వంటి అద్భుత పథకాన్ని అమలు చేసిన ఘనత సోనియాదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ హయాంలో కాదా? అని నిలదీశారు. గాంధీ కుటుంబం గురించి లక్ష్మణ్‌.. తన అమ్మా నాన్నను అడిగినా.. వాళ్లు దేవుళ్ల లాంటి వారనే చెబుతారని వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల పాలనలో మోదీ, అమిత్‌షా దేశానికి ఏం చేశారు? తెలంగాణలో ఒక్క పెద్ద కంపెనీనైనా ఏర్పాటు చేశారా? మోదీ ద్వారా ఇక్కడి బీజేపీ నేతలు ఏం తెచ్చారు? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లతోనే రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ఈ మేరకు రాహుల్‌ చెప్పింది నిజమని స్పష్టం చేశారు. హైడ్రాలో బీఆర్‌ఎస్‌ అనుకూల అధికారులు ఉన్నారేమో చెక్‌ చేసుకోవాలంటూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశానని ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి నిర్మలనే వద్దనుకున్నారని, మంత్రి దామోదర ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్‌ అని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో సంగారెడ్డిని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. తాను అలిగేంత బలహీనమైన నేతను కాదన్నారు. రాజకీయాల్లో ఆ పదమే తనకు నచ్చదని, ఇంత కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదన్నారు. రాజకీయాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 04:01 AM