Share News

TPCC president Mahesh Goud: రాహుల్‌ ప్రజాదరణను చూసి కేంద్రం భయపడుతోంది..

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:46 AM

దేశ ప్రజల్లో రాహుల్‌ గాంధీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు....

TPCC president Mahesh Goud: రాహుల్‌ ప్రజాదరణను చూసి కేంద్రం భయపడుతోంది..

  • అందుకే తప్పుడు కేసులు పెడుతోంది: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల్లో రాహుల్‌ గాంధీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్‌పై తాజాగా మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడమే దీనికి తిరుగులేని సాక్ష్యమని ఆదివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. రాహుల్‌ను రాజకీయంగా సవాల్‌ చేయలేక కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ సర్కారు ఆయనపై తప్పుడు కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై దశాబ్ద కాలంగా విచారణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నా ఒక్క ఆరోపణనూ నిరూపించలేకపోయాయన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కులు, సత్యం కోసం రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని, అందుకే ఆయనంటే బీజేపీకి భయమని చెప్పారు. బెదిరింపులకు కాంగ్రెస్‌ ఏనాటికీ తలొగ్గబోదన్నారు.

పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను లేవనెత్తుతాం: చామల

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన సమస్యలు, పెండింగ్‌ పనులు, ప్రజా సమస్యలను బలంగా లేవనెత్తుతామని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఎంపీల ఫోరం కన్వీనర్‌ మల్లు రవి నేతృత్వంలో.. రీజినల్‌ రింగ్‌రోడ్డు, రీజినల్‌ రైల్‌, మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు, పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌, కొత్త రైల్వే మార్గాలకు ఆమోదం, వరంగల్‌, కొత్తగూడెం, పెద్దపల్లి విమానాశ్రయాలకు అనుమతులివ్వాలంటూ డిమాండ్‌ చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక అనుమతులూ ఇవ్వాలని కోరతామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. థర్మల్‌ విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు పిలవకుండానే కుంభకోణాలు ఎలా జరిగాయంటూ హరీశ్‌రావును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్‌ ప్రశ్నించారు. హరీశ్‌ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 01 , 2025 | 05:46 AM