Share News

Former MP V. Hanumantha Rao: ఏడాదిలో పీవీ విజ్ఞాన వేదిక పూర్తి

ABN , Publish Date - Dec 24 , 2025 | 05:36 AM

వచ్చే ఏడాది పీవీ నరసింహారావు వర్ధంతి నాటికి పీవీ విజ్ఞాన వేదికను అందుబాటులోకి తీసుకువస్తామని మాజీ ఎంపీ వి.హనుమంతరావు హామీ ఇచ్చారు.

Former MP V. Hanumantha Rao: ఏడాదిలో పీవీ విజ్ఞాన వేదిక పూర్తి

  • నిధుల కోసం సీఎం రేవంత్‌ను కలుస్తాం: వీహెచ్‌

  • ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

భీమదేవరపల్లి/హైదరాబాద్‌/న్యూఢిల్లీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది పీవీ నరసింహారావు వర్ధంతి నాటికి పీవీ విజ్ఞాన వేదికను అందుబాటులోకి తీసుకువస్తామని మాజీ ఎంపీ వి.హనుమంతరావు హామీ ఇచ్చారు. పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ విజ్ఞాన వేదికను ఆయన సందర్శించారు. పీవీ విజ్ఞాన వేదికలో అసంపూర్తి పనులపై ‘మౌన మునీ.. మన్నించు’ శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతి మెయిన్‌ పేజీలో వార్త ప్రచురితమైంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే పీవీ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాల్సిన వీహెచ్‌.. ఆంధ్రజ్యోతిలో వార్తను చూసి వంగర వచ్చారు. జనవరి 4,5వ తేదీల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి వస్తే వంగర గ్రామస్థులను సీఎం దగ్గరికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వీహెచ్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని గ్రామస్థులకు చదివి వినిపించారు. ఆంధ్రజ్యోతి కథనం అక్షర సత్యమని పలుమార్లు ప్రస్తావించారు.

పీవీకి ప్రముఖుల నివాళి..

పీవీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీలో ఉన్న పీవీ లాంజ్‌లోని ఆయన చిత్రపటానికి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అంజలి ఘటించారు. పీవీ చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. విద్యార్థిగా ఉండగానే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి వందేమాతర గీతాలాపన చేసిన పీవీ నిజమైన జాతీయవాది అని ఆంధ్రజ్యోతి అసోసియేట్‌ ఎడిటర్‌ కృష్ణారావు అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated Date - Dec 24 , 2025 | 05:36 AM