PV Narsimha Rao Memorial Project: మౌన మునీ.. మన్నించు!
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:34 AM
తెలంగాణలో జన్మించి.. దేశానికి ప్రధానమంత్రి అయి.. రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను చాటిచెప్పిన వ్యక్తి ఆయన. ఎన్నో సంస్కరణలు చేపట్టి..
పీవీ నర్సింహారావు స్వగ్రామంలో అసంపూర్తిగా అభివృద్ధి పనులు
నాలుగేళ్లయినా పూర్తికాని పీవీ విజ్ఞాన వేదిక.. నేడు పీవీ వర్ధంతి
భీమదేవరపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జన్మించి.. దేశానికి ప్రధానమంత్రి అయి.. రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను చాటిచెప్పిన వ్యక్తి ఆయన. ఎన్నో సంస్కరణలు చేపట్టి.. సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను కాపాడిన నాయకుడు. అలాంటి వ్యక్తి పేరిట స్మారకంగా నిర్మించ తలపెట్టిన పనులు నాలుగేళ్లయినా పూర్తికావడంలేదు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట ఆయన జన్మించిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో చేపట్టిన పీవీ విజ్ఞాన వేదిక పనులు నిధుల కొరత కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయాయి. కాంగ్రెస్ తరఫున ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పీవీ పట్ల ఆ పార్టీ వివక్ష చూపిందని, తెలంగాణకు చెందిన పీవీకి తాము తగిన గౌరవం కల్పిస్తామంటూ 2021లో పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా పీవీ స్వగ్రామం వంగరను అభివృద్ధి చేస్తామని, పీవీ విజ్ఞానవేదికను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ అభివృద్ధి పనుల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.15 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. కానీ, నిధులు మాత్రం అరకొరగానే విడుదల చేయడంతో పనులు ప్రారంభం కాలేదు. పీవీ విజ్ఞాన వేదికలో చేపట్టిన పనుల్లోనూ కొన్ని మాత్రమే పూర్తికాగా, మరికొన్ని అర్ధంతరంగా నిలిచిపోయాయి. రూ.11 కోట్లతో విజ్ఞాన వేదికలో చేపట్టిన ఆడిటోరియం, పీవీ జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఓపెన్ థియేటర్, పీవీ వాడిన వస్తువులతో కూడిన మ్యూజియం, ఆధ్యాత్మిక కేంద్రం, ఆర్ట్ గ్యాలరీ, పీవీ విగ్రహం, దాని చుట్టూ పార్క్ ఏర్పాటు వంటి పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. పీవీ ఫొటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు రూ.4 కోట్లతో చేపట్టాల్సిన వంగర సమ్మక్క బోటి నుంచి వంగర పీవీ విజ్ఞాన వేదిక వరకు డబుల్ రోడ్‌కు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. మంగళవారం పీవీ నర్సింహారావు 21వ వర్థంతి జరగనున్న నేపథ్యంలో గ్రామస్థులు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వంగరలో పీవీ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన సోదరుడి కుమారుడు పీవీ మదన్‌మోహన్‌రావు తెలిపారు.