Indian Ambassador to Ireland Akhilesh Mishra: పీవీకి దక్కాల్సిన ఘనత మన్మోహన్‌కు దక్కింది
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:33 AM
ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇరువురు దూరదృష్టిఉన్న నాయకులని ఐర్లాండ్‌లో భారత రాయభారి అఖిలేశ్ మిశ్ర అన్నారు. గురువారం తనను కలిసిన ఆంధ్రజ్యోతి....
మోదీ, బాబు దూరదృష్టి ఉన్న వాళ్లు
ఐర్లాండ్‌లో భారత రాయబారిఅఖిలేశ్ మిశ్ర
(డబ్లిన్ నుంచి ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇరువురు దూరదృష్టిఉన్న నాయకులని ఐర్లాండ్‌లో భారత రాయభారి అఖిలేశ్ మిశ్ర అన్నారు. గురువారం తనను కలిసిన ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావుతో మాట్లాడుతూ.. సుపరిపాలనలో అందరినీ భాగస్వామ్యం చేసి సమర్థవంతమైన అభివృద్థిని అందించడంలో టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించిన ఘనత మోదీ, చందబాబులకు దక్కుతుందని అన్నారు. అభివృద్థికీ, ప్రజలకూ అనుకూలమైన విధానాలు చేపట్టడంలో ఈ ఇద్దరు నాయకులు విలువైన పాత్ర పోషించారని ఆయన చెప్పారు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంతోపాటు ఏపీకి గుర్తింపు పెరిగిందన్నారు. వికసిత్ భారత్‌ను సాధించడంలో మోదీ, చంద్రబాబు చరిత్రాత్మక పాత్ర పోషించగలరని ఆకాంక్షించారు. తన కెరీర్ తొలి దశలో గుంటూరులో పనిచేసిన రోజులను మిశ్ర గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోతే ఇవాళ దేశంలో జరుగుతున్న పెనుమార్పులు సంభవించేవి కావని చెప్పారు. పీవీకి దక్కాల్సిన ఘనత ఆయన ఆర్థికమంత్రిగా నియమించిన మన్మోహన్ సింగ్‌కు ఘనత దక్కిందని మిశ్రా అన్నారు. పీవీ నరసింహారావుపై అద్భుతమైన పుస్తకం రాశారని ఆయన కృష్ణారావును ప్రశంసించారు. భారతదేశం మాదిరే బ్రిటీష్ వారు ఐర్లాండ్‌ను చాలాకాలం పాలించారని, ఐరిష్ భాషను నాశనం చేశారని మిశ్ర పేర్కొన్నారు. కానీ, తర్వాత కాలంలో ఐర్లాండ్ ప్రభుత్వం, ప్రజలు కలిసి కట్టుగా కృషి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చారని, ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలోనూ ఐరిష్ భాషను బోధిస్తున్నారని అన్నారు. తెలుగు, తమిళంలాంటి అనేక ప్రాంతీయ భాషల్లో వచ్చిన ఉత్తమ సాహి త్యం ఏ యూరోపియన్ సాహిత్యానికీ తీసిపోదని, కానీ వాటిని అనువదించి ప్రపంచ వ్యాప్తంగా మన సాహిత్యానికి గుర్తింపు తేలేకపోతున్నామని మిశ్ర ఆవేదన వ్యక్తం చేశారు.