Deputy CM Bhatti Vikramarka: జాబ్ క్యాలెండర్లు తప్పనిసరి
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:16 AM
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలకు సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరి అని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పాలనా వ్యవస్థకు వెన్నెముకలు
నియామకాల్లో పారదర్శకత అవసరం
పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలకు సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరి అని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకలని పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో భట్టి ఈ మేరకు మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరిగా ఉండాలని, కమిషన్లు ఆ క్యాలెండర్‌కు కట్టుబడి వ్యవహరించాలని సూచన చేశారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో జాప్యం వల్ల యువతలో నిరాశ పెరుగుతోన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ముందస్తు ప్రణాళికతో పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్లపై ఉందన్నారు. వార్షిక క్యాలెండర్ అమలుతో వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను పాటిస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. పారదర్శకతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రాణమని అన్నారు. ప్రశ్న పత్రాల తయారీ నుంచి తుది ఎంపిక వరకు ప్రతీ పనిలో పారదర్శకత ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి రియల్‌టైమ్ సమాచారం అందించాలన్నారు. అభ్యర్థుల కలలను చిదిమేసే ప్రశ్నపత్రాల లీకేజీలను అడ్డుకోవాలని తెలిపారు.
ఇందుకోసం ఆధునిక భద్రతా వ్యవస్థలను అమలు చేయాలని, సిబ్బందికి నైతిక విలువలపై శిక్షణ ఇవ్వాలని భట్టి సూచించారు. ఇంటర్వ్యూలను జ్ఞాన పరీక్షలకే పరిమితం చేయకుండా అభ్యర్థి.. వ్యక్తిత్వం, నైతికత, నిర్ణయ సామర్థ్యాన్ని అంచనా వేసేలా రూపొందించాలని సూచించారు. విభిన్న నేపథ్యాల నిపుణులతో ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో కమిషన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నియామక ప్రక్రియల్లో న్యాయపరమైన వివాదాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టుల తీర్పుల నుంచి పాఠాలు నేర్చుకుని వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచన చేశారు. స్వతంత్ర సంస్థలైన కమిషన్లు.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. కమిషన్లు ఎంపిక చేసే అధికారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరగాలని భట్టి పిలుపునిచ్చారు.