Share News

Psycho Prisoners: సంగారెడ్డి జైలులో సైకో ఖైదీలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:28 AM

సంగారెడ్డి జైలుకు రిమాండ్‌ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారాగారంలో వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలైన ఆ ఇద్దరు.. జైలులో గంజాయి మత్తు లభించక సైకోల్లా ప్రవర్తించారు.

Psycho Prisoners: సంగారెడ్డి జైలులో సైకో ఖైదీలు

  • గంజాయి మత్తు లభించక వీరంగం

  • గాజు పెంకులు మింగుతామంటూ రభస

  • సంగారెడ్డి, ఉస్మానియా, ఎర్రగడ్డ, గాంధీ

  • ఆస్పత్రులకు జైలు అధికారుల పరుగులు

కంది, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జైలుకు రిమాండ్‌ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారాగారంలో వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలైన ఆ ఇద్దరు.. జైలులో గంజాయి మత్తు లభించక సైకోల్లా ప్రవర్తించారు. ఆత్మహత్యాయత్నాలు చేసి జైలు అధికారులను సంగారెడ్డి, ఉస్మానియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు పరుగులు పెట్టించారు. మరీ ముఖ్యంగా ఉస్మానియా ఆస్పత్రిలో బీభత్సం సృష్టించిన ఆ ఖైదీలు.. గాజు పెంకులు మింగి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఇటు పోలీసులు, అటు వైద్య సిబ్బందిని హడలెత్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ హత్యాయత్నం కేసులో ఇటీవల సంగారెడ్డి జైలుకు రిమాండ్‌ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు ఖైదీలు సెప్టెంబరు 15న జైలులోని గోడ గడియారం బ్యాటరీ, పెన్ను మూతను మింగేశారు. అనంతరం గాజు పెంకులు మింగి ఆత్మహత్యకు యత్నించామని, కడుపులో నొప్పిగా ఉందని జైలు అధికారులకు చెప్పారు. దీంతో జైలు అధికారులు వారిని హుటాహుటిన సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీసేందుకు వచ్చిన అక్కడి వైద్య సిబ్బంది, వైద్యులపై దూషణలకు పాల్పడిన వారిద్దరూ వింతగా ప్రవర్తిస్తూ వైద్యం చేయించుకునేందుకు నిరాకరించారు. దీంతో జైలు అధికారులు అఫ్జల్‌గంజ్‌ పోలీసుల సాయంతో ఆ ఖైదీలను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో మరింత రెచ్చిపోయిన ఆ ఖైదీలు.. పోలీసులను, వైద్యులను దూషిస్తూ వైద్యం చేయించుకోకుండా గట్టిగా కేకలు వేస్తూ వార్డులోని ఓ మంచాన్ని కూడా విరగొట్టారు. విరిగిన మంచంలోని ఓ ముక్కతో కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆపై, ఆ గాజు పెంకులతో ఒళ్లంతా గాట్లు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా గాజు పెంకులను నోట్లో పెట్టుకుని..


ఎవరైనా దగ్గరికొస్తే ఆ ముక్కలను మింగేస్తామంటూ వైద్య సిబ్బంది, పోలీసులను బెదిరించారు. అతికష్టం మీద వారిద్దరికీ సంకెళ్లు వేసిన పోలీసులు బలవంతంగా వైద్యం ప్రారంభించారు. కానీ, వైద్యులు ఇంజెక్షన్‌ చేసేటప్పుడు కూడా అటూఇటు ఊగిపోతూ ఎగురుతూ నర్సులపై తిరగబడుతూ నానా రభస చేశారు. దీంతో వీరి మానసిక పరిస్థితి బాగా లేదని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించాలని ఉస్మానియా వైద్యులు సూచించారు. దీంతో జైలు అధికారులు, పోలీసులు ఆ ఖైదీలను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన అక్కడి వైద్యులు ఖైదీల మానసిక స్థితి బాగానే ఉందని, కావాలనే విపరీతంగా ప్రవర్తిస్తున్నారని నిర్ధారించారు. దాంతో ఖైదీలను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఎలాగోలా వారికి ఎక్స్‌రేలు తీశారు. దాంతో ఆ ఖైదీలు గోడ గడియారం బ్యాటరీ, పెన్నుమూత మింగారని గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. మందులు ఇవ్వడంతో బ్యాటరీ, పెన్నుమూత బయటపడ్డాయి. అనంతరం ఆ ఖైదీలను డిశ్చార్జి చేయడంతో అటు పోలీసులు, ఇటు జైలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గంజాయికి బానిసలైన ఇద్దరు ఖైదీలు నిత్యం నేరాలకు పాల్పడుతుంటారని జైలు అధికారులు తెలిపారు. జైలులో నానాయాగీ చేస్తూ తమలా తయారవ్వాలని ఇతర ఖైదీలను కూడా ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 06:34 AM