Chief Justice Apresh Kumar Singh: న్యాయ వ్యవస్థ పరిరక్షణ బాధ్యత అందరిదీ
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:35 AM
బాధితులకు న్యాయం అందించడమే కర్తవ్యంగా న్యాయస్థానాలు పనిచేస్తున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు...
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్
భూపాలపల్లి, ములుగుల్లో కోర్టు భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన
పాల్గొన్న జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ రాజేశ్వర్‌రావు
భూపాలపల్లి (కృష్ణకాలనీ)/ములుగు కలెక్టరేట్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బాధితులకు న్యాయం అందించడమే కర్తవ్యంగా న్యాయస్థానాలు పనిచేస్తున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. పౌరుడి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పని చేస్తున్నాయని తెలిపారు. అందువల్ల న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. భూపాలపల్లి, ములుగుల్లో నిర్మించనున్న కోర్టు భవన సముదాయాలకు ఆయన శనివారం వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి ఎస్పీ కార్యాలయం, ములుగు కలెక్టరేట్‌ల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో హైౖకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ ఎన్.రాజేశ్వరరావులు నేరుగా హాజరయ్యారు. భూపాలపల్లిలోని కృష్ణకాలనీలో నిర్మించనున్న కోర్టు భవన సముదాయానికి సర్వమత ప్రార్థనల నడుమ ఇద్దరు న్యాయమూర్తులు శంకుస్థాపన చేశారు. ములుగులోని గట్టమ్మ దేవాలయం సమీపంలో నిర్మించనున్న కోర్టు భవనాలకు జస్టిస్ ఈవీ.వేణుగోపాల్, ఎన్.రాజేశ్వర్‌రావు భూమి పూజ చేశారు.