Panchayati Raj Minister Seethakka: ఉపాధి చట్టాన్ని రక్షించుకుందాం
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:17 AM
పేదలకు పని హక్కును కల్పించిన ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి...
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పేదలకు పని హక్కును కల్పించిన ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేయాలని పిలుపునిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. గ్రామ సభలు ఆమోదించిన ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన ‘జీ రామ్ జీ’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఉపాధి కూలీలతో ఈ నెల 27, 28 తేదీల్లో అన్ని గ్రామాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కొప్పుల రాజుతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. జీ రాం జీ చట్టం ద్వారా తీసుకువస్తున్న నిబంధనలు ఉపాధి హామీ ఉనికికే ప్రమాదమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నాడు గాడ్సే గాంధీజీని భౌతికంగా లేకుండా చేస్తే.. ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీజీ పేరు తొలగించి బీజేపీ ఆయన్ను మరోమారు హత్య చేసిందని తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటులో నాలుగు గంటలు కూడా చర్చ లేకుండా జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. అనంతరం కొప్పుల రాజు మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. గాంధీ, నెహ్రూల వారసత్వాన్ని చెరిపేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, ఇది మోదీ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.