Promotions: ఎక్సైజ్‌శాఖ మల్టీజోన్-1 పరిధిలో ప్రమోషన్లు
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:29 AM
రాష్ట్ర ఆబ్కారీ శాఖలో సుదీర్ఘకాలంగా (రాష్ట్ర విభజన నుంచి) ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియ తుది దశకు చేరింది.
ఎక్సైజ్ ఎస్సైలు, సీనియర్ అసిస్టెంట్లకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి
డీపీసీ సిఫారసులకు కమిషనర్ ఆమోదం
త్వరలోనే పోస్టింగ్ ఆర్డర్లు
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆబ్కారీ శాఖలో సుదీర్ఘకాలంగా (రాష్ట్ర విభజన నుంచి) ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియ తుది దశకు చేరింది. మల్టీజోన్-1 (ఎక్సైజ్‌శాఖ వరంగల్ జోన్) పరిధిలో ఖాళీగా ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ (పీ అండ్ ఈఐ) పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) రూపొందించిన జాబితాను ఆబ్కారీ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ ఆమోదించారు. ఈమేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్టీజోన్-1 పరిధిలోని 20 ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఖాళీలను (10 ప్రస్తుత ఖాళీలు, మరో 10 ముందస్తు అంచనా ఖాళీలు) గుర్తించిన ఎక్సైజ్ శాఖ వాటిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయనుంది. మల్టీజోన్-1 పరిధిలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 20 ఖాళీల భర్తీకిగాను 19 ఎస్సైలకు, ఒక సీనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి లభించగా, ఇద్దరిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల నిబంధనలు పాటించారు. ప్రమోషన్లు పొందిన వారికి త్వరలోనే పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయనున్నట్లు హరికిరణ్ తెలిపారు. డీపీసీ ఈ ఏడాది ఆగస్టులో చేసిన సిఫారుల మేరకు 2024-25 ప్యానెల్ సంవత్సరానికిగాను ప్రభుత్వ జీవోలు (జీవో44, జవో 36), రోస్టర్ పాయింట్లు, సీనియార్టీ ప్రాతిపదికన అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మహిళా అభ్యర్థులకు 33 శాతం హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తూ అల్వాల సరిత తదితరులను పదోన్నతుల జాబితాలో చేర్చారు. సీనియర్ అసిస్టెంట్ కోటా, స్పెషల్ ఎస్టాబ్లి్‌షమెంట్ కోటా కింద సీనియర్ అసిస్టెంట్ ఎం.జ్ఞానేశ్వర్‌కు ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి లభించింది. టి.సుస్మిత ఎంపికను హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ తుది తీర్పుకు లోబడి ఖరారు చేశారు. వీరితోపాటు పదోన్నతులు పొందిన వారిలో పి.లోభానందం, కె.రాజేశ్వరరావు, వి.రాఘవేందర్‌రావు, పి.మేఘమాల, లింగయ్య పాలకుర్తి, బి.గజేందర్, జి.చంద్రశేఖర్. ఐ.అశోక్‌కుమార్, వెంకటేశ్వర్ వైద్య, కిష్టయ్య బదావత్, రొండ్ల రూపా, ఎం.రమాదేవి, ఎల్.అచ్చారావు, మేడంశెట్టి సరిత, వై.జ్యోతి, మనీషా రాథోడ్, ఎన్.రజితలు ఉన్నారు. శీలం రాజేశ్వరి, ఎన్.సరితలను రిజర్వ్ జాబితాలో ఉంచారు. కాగా డీపీసీ పరిశీలనలో అర్ల గంగాధర్, ఎన్.మల్లేశం అనే ఇద్దరు అధికారుల పేర్లు పదోన్నతుల జాబితాలో ఉన్నప్పటికీ వారి ప్రొబేషన్ కాలం అధికారికంగా పూర్తి కాలేదని తేలింది. ప్రొబేషన్ పూర్తికాని పక్షంలో ఉన్నత పదవులకు, పదోన్నతికి అర్హత ఉండదు. దీంతో వారి పేర్లను ‘పాస్ ఓవర్’ (వచ్చే ఏడాదికి వాయిదా) చేశారు.