KTR: అప్పుడు హామీల జాతర..ఇప్పుడు చెప్పుల జాతర
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:59 AM
ఎన్నికల ముందు హామీల జాతర చేశారని.. ఎన్నికలయ్యాక చెప్పుల జాతర మొదలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో...
ఎన్నికల ముందు చెప్పి మరీ మోసం చేసిన రేవంత్
కాళేశ్వరంతో నీటి ఇబ్బందుల్లేకుండా చేసిన కేసీఆర్: కేటీఆర్
గజ్వేల్/మర్కుక్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు హామీల జాతర చేశారని.. ఎన్నికలయ్యాక చెప్పుల జాతర మొదలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా అధ్వానంగా మారిందని, గతంలోనే బాగుండేదని అన్ని వర్గాల వారు అంటున్నారని చెప్పారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఐఎన్‌టీయూసీ నాయకుడు ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు టీజీబీకేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికలు అయ్యాక చెప్పుల జాతరగా పాలన ఉందని రేవంత్‌రెడ్డి నిజాయితీగానే చెప్పాడన్నారు. నిజానికి గత ఎన్నికలకు తాము అతి విశ్వాసంతో వెళ్లామని, అందుకే నష్టపోయామని చెప్పారు. కేసీఆర్ అపర భగీరథుడిగా కాళేశ్వరం జలాలను 80 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు పోసి భవిష్యత్తులో తాగు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారని, పరిశ్రమలకు నీటిని ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో కరువు వచ్చినా మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకోవచ్చన్న ఉద్దేశంతోనే కాళేశ్వరం కట్టారన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీబీఐని మోదీ జేబు సంస్థ అని చెబితే.. రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కేసు విచారణను అదే సంస్థకు ఇచ్చాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై జరుగుతున్న కుట్రలో చంద్రబాబు, మోదీ పాత్ర ఉందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ప్రతిసారి కేవలం ఒక్క సీటే గెలుస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనస్పర్థలను పక్కనపెట్టి తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.