Prominent Poet Nandini Sidharreddy: తెలుగు కోసం ఆటా కృషి భేష్
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:28 AM
తెలుగు భాషా సాహిత్యాలు, సాంస్కృతిక రంగానికి అమెరికా తెలుగు సంఘం (ఆటా) సేవలు అభినందనీయమని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి కొనియాడారు....
ప్రముఖ కవి నందిని సిధారెడ్డి
తెలుగు వర్సిటీ వేదికగా ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషా సాహిత్యాలు, సాంస్కృతిక రంగానికి అమెరికా తెలుగు సంఘం (ఆటా) సేవలు అభినందనీయమని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష, సాహిత్య వికాసం కోసమే కాకుండా, అమెరికాలోనూ తెలుగు సంస్కృతి కోసం ఆటా, తానా సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సులో భాగంగా ఆదివారం నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో ‘జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్‌కుమార్ శుక్లా సాహిత్య సమాలోచన’ సదస్సు నిర్వహించారు. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిధారెడ్డి మాట్లాడుతూ తెలుగులో నవలల పోటీ నిర్వహించడం ద్వారా రచయితలను ప్రోత్సహించిన ఘనత ఆటాకు దక్కుతుందని చెప్పారు. భారతీయ భాషల మధ్య ఆదాన ప్రదానాలు అవసరమని కవి యాకూబ్ అన్నారు. హిందీ కవి, రచయిత వినోద్ కుమార్ శుక్లా మధ్యతరగతి జీవితాలను అద్భుతంగా అక్షరీకరించారని కొనియాడారు. వచ్చే ఏడాది వాషింగ్టన్ డీసీలో నిర్వహించే ఆటా తెలుగు మహాసభల్లో అమెరికాలోని తెలుగువారికి సాహిత్య పోటీలు నిర్వహిస్తామని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా తెలిపారు. ఆటా సాహిత్య వేదిక అధ్యక్షుడు వేణు నక్షత్రం, సతీశ్ రెడ్డి, సాయి సుధుని తదితరులు పాల్గొన్నారు.