Bus Fire Scare: చార్జీలు తగ్గించినా సగం సీట్లు ఖాళీ!
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:59 AM
ఏపీలోని కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ ఘోర అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలతోపాటు బెంగళూరు...
ప్రైవేటు ట్రావెల్స్‌పై ప్రయాణికుల్లో జంకు
గతంలో బుక్ చేసుకున్న టికెట్ల రద్దు
బోసిపోయిన టికెట్ కౌంటర్లు
హైదరాబాద్, ఖైరతాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ ఘోర అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలతోపాటు బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ టికెట్ ఽధరలు శనివారం తగ్గాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ తమ బస్సు సర్వీసుల టికెట్ల ధరలను బాగా తగ్గించింది. ఏపీలోని కావలికి గురువారం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు రూ.1800 వసూలు చేశారు. ప్రమాదం నేపథ్యంలో అదే కావలికి టికెట్ ధరను రూ.1100గా నిర్ణయించారు. ఇతర ప్రైవేటు బస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ నుంచి వెల్లూర్ (తమిళనాడు) వెళ్లే బస్సులో టిక్కెట్ ధర సాధారణంగా రూ.2 వేలు ఉండేది. ఇప్పుడు రూ. 1500కే ఇచ్చారు. ప్రమాదం నేపథ్యంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పటికే వివిధ మార్గాలకు సంబంధించి టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిలో కొందరు వాటిని రద్దు చేసుకున్నారు. ప్రమాదం తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్‌కు కొత్తగా టిక్కెట్ బుక్ చేసుకున్నవారు కూడా లేనట్లు తెలిసింది. ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ట్రావెల్ సర్వీసులు సైతం టిక్కెట్ ధరల్ని తగ్గించినట్లు తెలిసింది. పలు ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్ కౌంటర్లు శనివారం బోసిపోయాయి. ఆ బస్సుల్లో బుకింగ్స్ లేక సగం మంది ప్రయాణికులతోనే సర్వీసులు నడిపించారు. మరోవైపు.. ప్రయాణికుల్లో కొందరు ట్రావెల్స్ బస్సుల వద్ద ఆరా తీస్తూ కనిపించారు. డ్రైవర్ మంచోడేనా? లోపల బ్యాటరీల తరహాలో మండే గుణం ఉన్న పార్శిళ్లు గానీ పెట్టారా? అని నిర్వాహకులను అడిగారు. బస్సెక్కిన తర్వాత.. బాబ్బాబూ కాస్తా జాగ్రత్తగా తోలు అని డ్రైవర్‌ను బతిమాలుకోవడం కనిపించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులూ జాగ్రత్త పడ్డారు. ఫిట్‌నెస్ సరిగా లేని బస్సు సర్వీసులను ఎప్పటిలాగే రోడ్డెక్కిస్తే అధికారులు సీజ్ చేస్తారనే భయంతో వాటిని రద్దు చేశారు. ప్రయాణికులు తమ వెంట ఏమేం తెస్తున్నారు? అనే విషయాన్ని పరిశీలించారు. పార్శిళ్లనూ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న వస్తువులను తీసుకోబోమని స్పష్టం చేశారు.
ఆర్టీసీ వైపు మొగ్గు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో శనివారం ప్రయాణికుల్లో ఎక్కువమంది ఆర్టీసీ సర్వీసులవైపు మొగ్గుచూపారు. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో శనివారం ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో గతంతో పోలిస్తే కొంత ఎక్కువ టిక్కెట్లు బుక్ కావడమే అందుకు నిదర్శనం. తెలంగాణ, ఏపీ ఆర్టీసీ సర్వీసుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నా రు. ప్రయాణికులను తమ స్లీపర్ బస్సులవైపు ఆకర్షించేందుకు సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఎంచుకోవాలని స్లీపర్ బస్సు ఫొటోలతో ఎక్స్‌లో తెలంగాణ ఆర్టీసీ ప్రకటనలు ఇస్తోంది.