Passengers Escape Safely: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:23 AM
వికారాబాద్ జిల్లాలో బస్సును ఢీకొట్టిన టిప్పర్.. ఏపీలో బస్సు దగ్ధం ఘటనలు మరువక ముందే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో సోమవారం అర్థరాత్రి.....
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘటన.. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన భారీ ప్రాణనష్టం
భావోద్వేగంతో ప్రయాణికులు కన్నీటి పర్యంతం
చౌటుప్పల్ నుంచి వచ్చిన మంటలార్పిన ఫైరింజన్లు
చిట్యాల రూరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో బస్సును ఢీకొట్టిన టిప్పర్.. ఏపీలో బస్సు దగ్ధం ఘటనలు మరువక ముందే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో సోమవారం అర్థరాత్రి తర్వాత జరిగిన బస్సు ప్రమాదం గుగుర్పాటుకు గురి చేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ కృష్ణ కేకలేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. నాన్ ఏసీ బస్సు కావడంతోపాటు తెరిచిన కిటికీల నుంచి, వెనుకవైపు డోర్ నుంచి ప్రయాణికులు త్వరత్వరగా బయటకు రావడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. వారు చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ అయినా డీజిల్ ట్యాంకుకు మంటలంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని బీరంగూడ నుంచి ఇద్దరు డ్రైవర్లు, 29 మంది ప్రయాణికులతో ఎన్‌ఎల్01బీ 3250 నంబరు బస్సు సోమవారం రాత్రి 11 గంటలకు బయలుదేరింది. రాత్రి వేళ కావడంతో డ్రైవర్ కృష్ణ యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివారులో 20 నిమిషాలు బస్సును నిలిపాడు. ఆయనతోపాటు కొందరు ప్రయాణికులు టీ తాగాక బస్సు బయలు దేరింది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని పిట్టంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇంజన్ నుంచి పొగ, మంటలు వస్తుండటంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. బస్సులో మంటలొస్తున్నాయని ప్రయాణికులంతా కిందకు దిగాలని కేకలేశాడు. అంతకు ముందే టీ తాగడానికి బస్సు ఆపడంతో మెళకువగా ఉన్న ప్రయాణికులు.. డ్రైవర్ కేకలతో 2 నిమిషాల్లో వెనుక ద్వారం, కిటికీల నుంచి కిందకు దిగారు. అయినా లోపలెవరైనా ఉన్నారా? అని ప్రయాణికులు వేస్తున్న కేకలతో స్లీపర్ సీటులో నిద్రిస్తున్న ప్రయాణికుడు లేచి.. దిగడానికి ప్రయత్నిస్తుండగానే ఓ ప్రయాణికురాలు అతని చేతిని పట్టుకుని కిందకు లాగేశారు. బస్సు పేలిపోయే ప్రమాదం ఉందని, దూరంగా వెళ్లాలని డ్రైవర్ హెచ్చరించాడు. తాము చూస్తుండగానే బస్సు దగ్ధమవుతున్న దృశ్యాలను చూస్తూ.. ఇది కలా.. నిజమా..? అని, దిగకుంటే తమ పరిస్థితేమిటని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.
బస్సులో అసలు రక్షణ చర్యల్లేవని, అగ్ని ప్రమాద నివారణకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇచ్చిన సమాచారంతోనే చౌటుప్పల్ నుంచి వచ్చిన 2 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పేశాయి. ప్రమాద సంగతి తెలియగానే నార్కట్‌పల్లి సీఐ కె.నాగరాజు, చిట్యాల ఏఎ్‌సఐ వెంకటయ్య ఆధ్వర్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద నేపథ్యంలో ఆ అర్థరాత్రి.. రహదారిపై వెళ్లే ఇతర వాహనాల్లో సొంతూళ్లకు బయలు దేరగా, సీఐతోపాటు పోలీసులు కూడా వారికి సహకరించారు. విహారి ట్రావెల్స్ పేరిట నెల్లూరు - హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ బస్సును నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ (ఎన్‌ఎల్01బీ3250) చేశారు. బస్సు యజమాని పేరు కడిమళ్ల శరత్ కాగా, హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.8,605 జరిమాన చెల్లించాల్సి ఉంది.
మంటలను గమనించి అప్రమత్తం చేశా
‘చౌటుప్పల్ శివారులో టీ బ్రేక్ తర్వాత బయలు దేరిన 20 నిమిషాలకు మంటలు రావడం గమనించా. 2 నిమిషాల్లోనే అందరిని అప్రమత్తం చేశాను. ప్రయాణికులందరూ సురక్షితంగా కిందికి దిగారు’ అని డ్రైవర్ కృష్ణ తెలిపారు.