Prime Minister Narendra Modi: అణువిద్యుత్‌లో ప్రైవేటు భాగస్వామ్యం
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:48 AM
దేశంలో అణు విద్యుత్తు ఉత్పత్తికి ప్రైవేటు కంపెనీలకు కూడా త్వరలో అవకాశం కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు....
త్వరలోనే ప్రైవేటు రంగానికి అవకాశం
2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తు
అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రైవేటు రంగం భేష్: మోదీ
దేశంలోనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ విక్రం-1 ఆవిష్కరణ
రూపొందించిన హైదరాబాద్ కంపెనీ స్కైరూట్
న్యూఢిల్లీ, నవంబరు 27: దేశంలో అణు విద్యుత్తు ఉత్పత్తికి ప్రైవేటు కంపెనీలకు కూడా త్వరలో అవకాశం కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రైవేటు అంతరిక్ష పరిశోధన స్టార్టప్ సంస్థ స్కైరూట్ తయారుచేసిన దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ విక్రం-1ను హైదరాబాద్‌లోని ఆ సంస్థకు చెందిన ఇన్ఫినిటీ క్యాంప్‌సలో ప్రధానమంత్రి మోదీ గురువారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. అంతరిక్ష రంగంలో దేశంలోని ప్రైవేటు సంస్థలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అణు విద్యుత్ రంగంలో త్వరలోనే ప్రైవేటు కంపెనీలకు అవకాశం క ల్పిస్తాం. అణువిద్యుత్ రంగంలో నవకల్పనలకు, అత్యాధునికమైన చిన్న రియాక్టర్ల తయారీకి ఈ నిర్ణయం శక్తినిస్తుంది. భిన్న మార్గాల ద్వారా శక్తి వనరులను సమకూర్చుకొని ఇంధన భద్రతను బలోపేతం చేయాలని, అణు ఇంధన రంగంలో పరిశోధనలను వేగవంతం చేయటం ద్వారా భారత్ స్మాల్ రియాక్టర్లను రూపొందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది’ అని వివరించారు.
ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారత ప్రైవేటు అంతరిక్ష రంగం
అంతరిక్ష పరిశోధనల్లో విశేష కృషి చేస్తున్న భారతీయ ప్రైవేటు సంస్థలు.. ఈ రంగంలో ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు రంగానికి మేము అవకాశం కల్పించినందువల్లే స్కైరూట్ వంటి సంస్థలు పుట్టుకొచ్చి వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నాయి. యువతరం గొప్ప శక్తికి, నవకల్పనలకు, నూతన ఆలోచనలకు ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రతిబింబంగా నిలుస్తోంది. యువత నూతన ఆవిష్కరణలు, నష్టభయాలను స్వీకరించే శక్తి, వ్యవస్థాపకత కొత్త శిఖరాలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రైవేటు అంతరిక్ష రంగం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, నేడు ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. దాదాపు 300 ప్రైవేటు కంపెనీలు ఈ రంగం భవిష్యత్తును నిర్మించే పనిలో ఉన్నాయి’ అని కొనియాడారు.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు..
భారత్‌లో అణు విద్యుత్, ఇతర న్యూక్లియర్ పరిశోధనలు పూర్తిగా ప్రభుత్వరంగంలోనే కొనసాగుతున్నాయి. ‘అటామిక్ ఎనర్జీ యాక్ట్ -1962’ ద్వారా ఈ రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ చట్టం స్థానంలో మోదీ సర్కారు కొత్త చట్టం తీసుకొచ్చి ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అందుకోసం డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ‘ది అటామిక్ ఎనర్జీ బిల్-2025’ను ప్రవేశపెట్టబోతోంది. అణు విద్యుత్ విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించేలా 2025-26 వార్షిక బడ్జెట్‌లోనే నిర్ణయం తీసుకున్నట్లు గత ఆగస్టులో అణు ఇంధన విభాగం వెల్లడించింది. ‘సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్-2010’ (సీఎల్‌ఎన్‌డీ)కి కూడా సవరణలు చేయనున్నారు. ప్రస్తుతం మనదేశంలో ప్రస్తుతం అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,880 మెగావాట్లు ఉంది. దీనిని 2031-32 నాటికి 22,480 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించారు. 2070 నాటికి పూర్తిగా కాలుష్యరహిత మార్గాల ద్వారానే (నెట్ జీరో) విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.