Private Hospitals to Suspend Aarogyasri: నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:07 AM
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేయనున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది నుంచి ఆరోగ్యశ్రీ...
నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటన
రూ.100 కోట్లు విడుదల చేసిన సర్కారు
అయినా.. మెట్టు దిగని ప్రైవేటు ఆస్పత్రులు
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేయనున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది నుంచి ఆరోగ్యశ్రీ, 18 నెలలుగా ఈహెచ్‌ఎ్‌స పథకానికి సంబంధించిన బకాయిలు చెల్లించడం లేదని వివరించారు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరంగా మారరిందని వెల్లడించారు. మరోవైపు నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సోమవారం రూ.100కోట్లు చెల్లించింది. అయినా, ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు మాత్రం వైద్య సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. ఈ నెల 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు గత నెల 21న నెట్‌వర్క్ ఆస్పత్రులు లేఖలు రాశాయి. దాంతో ప్రభుత్వం ఆగస్టు 30న నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఒకటి రెండు రోజుల్లోనే కొంత మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతను వాయిదా వేసుకున్నారు. కానీ, 15రోజులైనా ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో సేవలు నిలిపివేయాల్సి వస్తోందని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి. రూ.1200-1400 కోట్ల బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కాగా, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.530కోట్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.550కోట్లు కలిపి మొత్తం రూ.1100కోట్లు చెల్లించాల్సి ఉందని ఆరోగ్యశ్రీ ట్రస్టు వర్గాలు పేర్కొన్నాయి.