Land Dispute: వివాదంలో50 కోట్ల అసైన్డ్ భూమి
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:46 AM
రూ.50 కోట్ల అసైన్డ్ భూమి వివాదంలో చిక్కుకుంది. దీన్ని అక్రమంగా సొంతం చేసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థ పథకం వేసింది....
కాజేసేందుకు ఓ ప్రైవేట్ సంస్థ పన్నాగం
అఫిడవిట్లు సృష్టించి తప్పదోవ పట్టించే యత్నం
నేడు అధికారుల కౌంటర్ పిటిషన్
కంది, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రూ.50 కోట్ల అసైన్డ్ భూమి వివాదంలో చిక్కుకుంది. దీన్ని అక్రమంగా సొంతం చేసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థ పథకం వేసింది. అందులో ఏకంగా ఓ మామిడితోటను పెంచింది. అఫిడవిట్లు సృష్టించి రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సంగారెడ్డి జిల్లా కోర్టులో నేడు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ సర్వే నంబర్ 114లో దాదాపు 50 ఎకరాల సర్కారు భూమి ఉంది. ఇందులో నిరుపేదలు సాగు చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు గతంలో అసైన్డ్‌భూమి కింద హక్కులు కల్పించారు. కొన్నేళ్ల క్రితం ఇదే సర్వేనంబరు పక్కన ఓ ప్రైవేట్ సంస్థ ఐదెకరాలను కొనుగోలు చేసింది. దీనికి ఆనుకుని ఉన్న 10.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసింది. దీన్ని సాగు చేసుకుంటున్న రైతులకు అరకొర డబ్బు ఆశ చూపి తమ పేరిట కాగితం రాయించుకుంది. దీనికి కోసం కొన్ని అఫిడవిట్లు సృష్టించి రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఆ స్థలంలో మామిడి మొక్కలు నాటి, రేకులషెడ్లు నిర్మించి, చుట్టూ కంచె వేసి గేట్లు అమర్చింది. నాలుగేళ్ల క్రితం కొందరు స్థానికుల ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని తమ అధీనంలోకి తీసుకున్నారు. 2009 నుంచి 2016 వరకు ఆ మామిడితోటలో కాసిన పండ్లను అధికారులే వేలం ద్వారా విక్రయించేవారు. ఆ తర్వాత ఇది నిలిచిపోయింది. ఎవరూ పట్టించుకోక పోవడంతో ప్రైవేట్ సంస్థ యాజమాన్యం మరోసారి పాత పత్రాలతో ఆ భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కంది తహసీల్దార్ రవికుమార్ మండలంలోని అన్ని ప్రభుత్వ భూముల రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు గురువారం 10.37 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆ భూమిపై తమకు అనుకూలంగా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని వారిని సంస్థ యాజమాన్యం అడ్డుకుంది. ఇది కచ్చితంగా ప్రభుత్వ భూమేనని తహసీల్దార్ తెలిపారు. దానిని కబ్జా కోరల్లోంచి విడిపించేందుకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.