Share News

Private College Managements: వచ్చేనెల 3 నుంచి కాలేజీల సమ్మె

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:54 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం మరోసారి సమ్మె బాట పట్టాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఫీజుల చెల్లింపు..

Private College Managements: వచ్చేనెల 3 నుంచి కాలేజీల సమ్మె

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం

  • ప్రైవేటు కళాశాలల సమాఖ్య నిర్ణయం

  • ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు

  • సర్కారుపై నమ్మకం సన్నగిల్లుతోంది

  • ప్రభుత్వ తీరుతో కాలేజీలను

  • కొనసాగించలేని దుస్థితి: యాజమాన్యాలు

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం మరోసారి సమ్మె బాట పట్టాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఫీజుల చెల్లింపు కోసం గడచిన నెల రోజులుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం లేకుండా పోయిందని, అందుకే నవంబరు 3 నుంచి కాలేజీల నిరవధిక బంద్‌ పాటించాలని నిర్ణయించామని ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘాల సమాఖ్య ప్రకటించింది. సమ్మెకు సంబంధించి ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని తెలిపింది. ఆదివారం సమాఖ్య కార్యవర్గం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఫీజుల విషయంలో ప్రభుత్వం నుంచి చిత్తశుద్ధి కరువైందని సమాఖ్య ప్రతినిధులు ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు హామీ ఇచ్చినా.. దీపావళికి ముందు రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి కనీసం చర్చించకపోవడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని సమాఖ్య అధ్యక్షుడు రమేశ్‌బాబు తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విశ్వాసంతో ఇప్పటివరకు సమ్మెను వాయిదా వేస్తూ వచ్చామని, కానీ.. రోజురోజుకూ సీఎంపై నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రైవేటు కళాశాలలు నడిపించలేని స్థితిలో ఉన్నాయని, మరో మార్గం లేకనే సమ్మె చేస్తున్నామని తెలిపారు. కాగా, ఆదివారం కార్యవర్గ సమావేశానికి ముందు సమాఖ్య సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారుగా ఉన్న కె.కేశవరావుతో సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రితో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Oct 20 , 2025 | 04:54 AM