Private Colleges to Begin Indefinite Strike: 15 నుంచి ఉన్నత విద్యాసంస్థల బంద్!
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:35 AM
భారీగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 15...
ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయం
రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించని ప్రభుత్వం
కాలేజీల నిర్వహణ భారంగా మారింది: సమాఖ్య
ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు, విద్యాశాఖ కార్యదర్శికి నోటీసు అందజేత
సీఎంతో మాట్లాడతానన్న యోగితా రాణా
నేడు చర్చలకు రావాలన్న వేం నరేందర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): భారీగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 15 నుంచి అన్ని ఉన్నత విద్యాసంస్థలను నిరవధికంగా బంద్ చేస్తామని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. మొత్తం రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనిపై కొద్ది నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదని పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంద్ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు సమాఖ్య ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని కలిసి బంద్ నోటీసు అందజేశారు. బడ్జెట్‌లో కేటాయించి.. ఇప్పటికే టోకెన్లు జారీ చేసిన రూ.1200 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని వారు గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సర్కారుపై భారం పడకుండా తాము ట్రస్టు బ్యాంకు లాంటి ఇతర ప్రత్యామ్నాయాలను చూపించినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారిందని, సిబ్బంది జీతభత్యాలకు కూడా యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఈ నెల 15న నిర్వహిస్తున్న ‘ఇంజనీర్స్ డే’ రోజు నుంచి తమ సమ్మె ప్రారంభమవుతుందని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని సమాఖ్య అధ్యక్షుడు రమేశ్‌బాబు, సెక్రటరీ జనరల్ కెఎస్ రవికుమార్, కె.సునీల్‌కుమార్, కె.కృష్ణారావు తెలిపారు.
సరైన సమయం కాదు.. సీఎంతో మాట్లాడతా
ఉన్నత విద్యాసంస్థల బంద్‌కు సంబంధించి యాజమాన్య సంఘాల ప్రతినిధులు శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కూడా కలిసి నోటీసు అందజేశారు. ఇప్పటివరకు చాలా వేచి చూశామని, ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో బంద్ పాటిస్తామని చెప్పారు. దీంతో.. సమ్మెకు ఇది సరైన సమయం కాదని యోగితా రాణా అన్నారు. విడతల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ విషయంపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. శనివారం ఉదయం 10 గంటలకు వారితో నరేందర్‌రెడ్డి చర్చలు జరపనున్నారు.
బకాయిల కోసం మూడేళ్లుగా నిరీక్షణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల కోసం ఇంజనీరింగ్, ఫార్మా, పాలిటెక్నిక్ తదితర వృత్తి విద్యా కళాశాలలు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాయి. గతంలో ఒకసారి ఈ బకాయిలలో కొంత తగ్గించి, ఒకేసారి సెటిల్‌మెంట్ చేస్తామనే ప్రస్తావన వచ్చింది. ఆ తరువాత కూడా దీనిపై కొన్నిసార్లు చర్చలు జరిగాయి. అయినా బకాయిలు మాత్రం విడుదల కాలేదు. మరోవైపు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో ఫీజు బకాయిలు చెల్లించాల్సిందేనని షరతులు విధిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వచ్చిన తరువాత మీ డ బ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తామని విద్యార్థులతో అంటున్నాయి. ఇటీవలి కాలంలో ఇదే విషయంపై నల్లగొండలోని ఓ ఫార్మా కళాశాలకు చెందిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. దానికి స్పందించిన మానవ హక్కుల సంఘం ఈ చర్య విద్యార్థుల హక్కులను కాలరాయడమేనని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని, కళాశాల నిర్వహణ భారంగా మారిందని సదరు కళాశాలలు పేర్కొంటున్నాయి. కాగా, జీతాలు ఇవ్వకపోవడంతో కొందరు అధ్యాపకులు బోధనను అంతగా సీరియ్‌సగా తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. దాంతో బోధనలో నాణ్యత తగ్గుతోందని, తర్వాతి కాలంలో విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలన్నీ ఒకేసారి కాకపోయినా.. దశల వారీగా విడుదల చేసినా కళాశాల నిర్వహణకు కొంత వెసులుబాటుగా ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి.