Private college Associations: బకాయిలు అడిగితే.. అవమానిస్తున్నారు
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:03 AM
విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య రంగంగా గుర్తించట్లేదని.. ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్య తీవ్రతను సర్కారు...
దసరాలోపు 600 కోట్లు ఇస్తామన్నారు.. ఇచ్చింది 200 కోట్లే.. ఈ నెల 12లోగా 1000 కోట్లు ఇవ్వకుంటే సమ్మెకు దిగుతాం
మంత్రులు మాట నిలబెట్టుకోలేదు.. ఇకపై చర్చలు ముఖ్యమంత్రితోనే
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య రంగంగా గుర్తించట్లేదని.. ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్య తీవ్రతను సర్కారు అర్థం చేసుకోవట్లేదని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) పేర్కొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరితే.. తమను అవహేళన చేస్తున్నారని, అవమానిస్తున్నారని సమాఖ్య చైర్మన్ నిమ్మగడ్డ రమేశ్ బాబు ఆవేదన వెలిబుచ్చారు. బకాయిలు చెల్లించడానికి డబ్బుల్లేవని సర్కారు చేతులెత్తేసిన నేపథ్యంలో.. ఫాతీ అత్యవసర సర్వసభ్య సమావేశం బుధవారం నగరంలోని బోట్స్‌క్లబ్‌లో నిర్వహించారు. సర్కారు హామీ మేరకు నిధులు విడుదల కాకపోవడంపై సమావేశంలో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దసరాలోపు రూ.600 కోట్లు, దీపావళిలోపు రూ. 600 కోట్లు ఇస్తామని మీడియా సమావేశంలో ప్రకటించిన మంత్రులు.. బుధవారం నాటికి రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేశారని రమేష్ బాబు తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన ఉన్నత విద్యారంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రైవేటు కాలేజీలు.. ఇప్పుడు సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని దుస్థితిలో కొనసాగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. తమ సమస్యను ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదని వాపోయారు. సీఎం ఆఫీసు నుంచి తమకు ఆదేశాలు రానందున మొత్తం నిధులు ఇవ్వలేదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారని.. కానీ సీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా ఆర్థిక శాఖ ఉద్దేశపూర్వకంగా సమస్యను పరిష్కరించట్లేదని లేదని ఆయన ఆరోపించారు. ఇకపై తాము ఈ విషయమై.. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రితోనే చర్చిస్తామన్నారు. దసరాలోపు ఇవ్వాల్సిన రూ.400 కోట్లతోపాటు దీపావళిలోపు ఇస్తామన్న రూ.600 కోట్లు కలిపి.. మొత్తం రూ.వెయ్యి కోట్లూ ఈ నెల 12లోపు చెల్లించాలని రమేశ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 13 నుంచి సమ్మెకు సిద్ధమని, ఆ రోజు నుంచి తరగతులు బహిష్కరిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 13 నుంచి 18 వరకూ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు నిరసన, సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తామన్నారు. టోకెన్ల బకాయిలన్నీ చెల్లించడంతోపాటు.. మూడేళ్లుగా పెండింగులో ఉన్న మొత్తం బకాయిల విడుదలపై ప్రభుత్వం రోడ్‌మ్యాప్ ప్రకటించాలని రమేశ్ బాబు డిమాండ్ చేశారు.