Share News

Fee Reimbursement: ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలివ్వండి

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:53 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసిన తర్వాతే విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలని తెలంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాల సమాఖ్య..

Fee Reimbursement: ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలివ్వండి

  • 1లోపు 900 కోట్లు విడుదల చేయాలి

  • తర్వాతే విజిలెన్స్‌ విచారణకు సహకరిస్తాం

  • ప్రైవేటు కాలేజీ యాజమాన్య సంఘాలు

  • విజిలెన్స్‌ దాడులు దుర్మార్గం: సంజయ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసిన తర్వాతే విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలని తెలంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాల సమాఖ్య(ఫాతీ) ప్రభుత్వాన్ని కోరింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్న అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడంపై ఫాతీ గురువారం అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. బకాయిల కోసం సమ్మె ప్రకటించిన తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించడం కక్ష సాధింపుగా పరిగణిస్తున్నామని ఫాతీ అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్‌ బాబు చెప్పారు. ప్రభుత్వం దసరాకు ముందు ఇచ్చిన హామీ మేరకు నవంబరు-1లోపు రూ.900 కోట్లు విడుదల చేయాలని, లేనిపక్షంలో నవంబరు-3 నుంచి అన్ని ప్రైవేటు వృత్తివిద్యా కాలేజీలు నిరవధిక సమ్మెలో పాల్గొంటాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్‌ దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకపోతే విద్యా సంస్థలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో 15 లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నా సోయి లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

బకాయిలు చెల్లించమంటే దాడులా?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలన్న ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలపై విజిలెన్స్‌ దాడులను ఏఐఎ్‌సఎఫ్‌ తప్పుబట్టింది. పెండింగ్‌లో ఉన్న 8వేల కోట్ల బకాయిలు చెల్లించిన తరువాతే తనిఖీలు చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 31 , 2025 | 02:53 AM