Share News

Shut Down Over Fee Reimbursement Dues: ప్రైవేటు కాలేజీల బంద్‌ ప్రశాంతం

ABN , Publish Date - Nov 04 , 2025 | 02:36 AM

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం నుంచి...

Shut Down Over Fee Reimbursement Dues: ప్రైవేటు కాలేజీల బంద్‌ ప్రశాంతం

  • రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల మూత

  • మాది జీవన్మరణ సమస్య.. అన్నింటికీ సిద్ధమయ్యాం

  • కనీసం రూ.5వేల కోట్ల బకాయిలు విడుదల చేయాల్సిందే

  • రెండేళ్లలో ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలే

  • ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాల సమాఖ్య ఆరోపణ

  • తొలిరోజు 98శాతం కళాశాలలు బంద్‌లో పాల్గొన్నాయని వెల్లడి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ సహా అన్ని వృత్తివిద్యా కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌ చేపట్టాయి. సెలవులు ఇస్తున్నామని ఆదివారమే విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. కొన్ని విద్యా సంస్థలు తమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను ఇళ్లకు పంపేశాయి. ఫీజు బకాయిల విడుదల చేయాలంటూ కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ప్రైవేటు కాలేజీల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాగా, హైదరాబాద్‌లో బాచుపల్లి, గండిపేట ప్రాంతాల్లోని రెండు పేరున్న కళాశాలలు, మైసమ్మగూడలోని ఓ మాజీ మంత్రికి చెందిన విద్యా సంస్థలు సోమవారం బంద్‌కు దూరంగా ఉన్నాయి.

హామీ నిలబెట్టుకోనందునే బంద్‌: ఫాతీ

రాష్ట్రంలోని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో 98శాతం మేర తొలిరోజు బంద్‌లో పాల్గొన్నాయని ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాల సమాఖ్య (ఫాతీ) ప్రకటించింది. మంగళవారం నుంచి వందశాతం కాలేజీలు పాల్గొంటాయని తెలిపింది. ఫాతీ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాతీ అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేశ్‌బాబు మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోవడంతో మరో మార్గం లేక సమ్మెకు దిగామని చెప్పారు. ఫీజు బకాయులు అడిగితే ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం బాధాకరమని పేర్కొన్నారు. ‘‘పెద్దన్నలా అండగా ఉండాల్సిన ప్రభుత్వం విజిలెన్స్‌ పేరుతో బెదిరించడం సరికాదు. ఏవైనా కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను దుర్వినియోగం చేశాయని ప్రభుత్వం భావిస్తే.. దానికి కారణం కాలేజీల యాజమాన్యాలు కాదు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన తహసీల్దార్లే కారణం. ప్రభుత్వం వారిని కూడా బాధ్యులను చేయాలి’’ అని రమేశ్‌బాబు డిమాండ్‌ చేశారు.


సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోలేని దుస్థితిలో విద్యా సంస్థల యాజమాన్యాలు ఉన్నాయని.. అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్ల పాటు ఎలాంటి ఒత్తిడీ చేయకుండా ఓపిక పట్టామని చెప్పారు. కాలేజీల యాజమాన్యాలకు ఇది జీవన్మరణ సమస్య అని, అన్నింటికీ సిద్ధమయ్యే సమ్మెకు దిగామని పేర్కొన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన రూ.1,500 కోట్లు నిధుల విడుదల, ఫాతీ ప్రతినిధులతో కమిటీ, సీఎంతో సమావేశం ఏర్పాటు మూడు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. మొత్తం రూ.10వేల కోట్ల బకాయిల్లో కనీసం సగం మేర రూ. 5వేల కోట్లు విడుదల చేశాకే ప్రభుత్వంతో చర్చలు ఉంటాయని, అప్పటివరకు సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న 30వేల మంది సిబ్బందితో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని.. ఈ నెల 11న 10లక్షల మంది విద్యార్థులతో భారీ ఆందోళన చేపడతామని రమేశ్‌బాబు తెలిపారు. ఇక ఫాతీ ఉపాధ్యక్షుడు అలీజాపూర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది విద్యారంగానికి కేటాయించిన రూ.23,700 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జేఎన్టీయూ స్పాట్‌ అడ్మిషన్లపై ‘ఫీజు’ ఎఫెక్ట్‌!

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియపై ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభావం కనిపించింది. వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఖాళీగా ఉన్న 112కుపైగా పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలోనే వచ్చినా.. శనివారం ఏడు, సోమవారం మరో ఏడు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పీజీఈసెట్‌ నిబంధనల ప్రకారం.. ఎంటెక్‌ స్పాట్‌ అడ్మిషన్ల కోసం అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని, అలా లేని వారికి సీట్లు కేటాయించేందుకు వీలు కాలేదని అడ్మిషన్ల విభాగం డైరెక్టర్‌ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాలేదంటూ కాలేజీలు తమకు బీటెక్‌ సర్టిఫికెట్లను ఇవ్వలేదని అభ్యర్థులు వాపోయారు.

Updated Date - Nov 04 , 2025 | 02:36 AM