Share News

Fee Reimbursement: నేటి నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్‌

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:28 AM

రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు సోమవారం నుంచి సమ్మె బాట పట్టనున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ సహా అన్ని వృత్తి విద్య..

Fee Reimbursement: నేటి నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్‌

  • బకాయిల విడుదలపై అధికారులతో చర్చలు విఫలం

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు సోమవారం నుంచి సమ్మె బాట పట్టనున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ సహా అన్ని వృత్తి విద్య కాలేజీలు సమ్మెలో పాల్గొననున్నాయి. యాజమాన్యాల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా 1,840 కాలేజీలు బంద్‌ కానున్నాయి. ఫలితంగా దాదాపు 35లక్షలకు పైగా విద్యార్థులపై సమ్మె ప్రభావం పడనుంది. గత నాలుగేళ్లుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) గత రెండు నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతోంది. పలు విడతలుగా చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో దీపావళిలోగా రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అయితే ఇందులో రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగతా రూ.900 కోట్లు వెంటనే విడుదల చేయాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ప్రభుత్వానికి ఫాతీ సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫాతీ ప్రతినిధులతో మాట్లాడారు. రూ.150 కోట్లు విడుదల చేస్తామని, సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి యాజమాన్యాలు అంగీకరించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని ఫాతీ అధ్యక్షుడు నిమ్మగడ్డ రమే్‌షబాబు తెలిపారు. సోమవారం నుంచి అన్ని ఉన్నత విద్యాసంస్థలు సమ్మెలో పాల్గొంటాయన్నారు. ప్రభుత్వంతో చర్చలు కొనసాగినా.. బకాయిలు ఇవ్వనంతవరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షలు వాయిదా వేయాలని అన్ని వర్సిటీలను కోరినట్టు తెలిపారు. సమ్మె నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఎన్‌టీయూ పరిధిలోని ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్‌ వార్షిక పరీక్షలను వాయిదా వేశారు. అలాగే బీఈడీ, డీఈడీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అనేక కాలేజీల్లో జరుగుతున్న ఇంజనీరింగ్‌ ఇంటర్నల్‌ పరీక్షలనూ వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 800 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా.. 300 ఎంబీఏ-ఎంసీఏ, 215 బీఈడీ, 175 ఇంజనీరింగ్‌, 123 ఫార్మసీ, 100 పాలిటెక్నిక్‌, 70 డైట్‌, 27 ఆర్కిటెక్చర్‌, 30 న్యాయ కళాశాలలున్నాయి.

Updated Date - Nov 03 , 2025 | 03:28 AM