Private college owners association: యూజ్‌లెస్ శ్రీదేవసేన
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:26 AM
మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరితే సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన యూజ్‌లెస్ కాలేజెస్ అన్నారు. ప్రభుత్వానికి, కాలేజీ...
విద్యారంగంపై ఆమెకు అవగాహన లేదు
ఆమెను వెంటనే బదిలీ చేయాలి
ముఖ్యమంత్రికి సరైన సలహాలిచ్చే అధికారులే లేరు
8న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ
50శాతం బకాయిలు ఇచ్చే వరకు సమ్మె
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘‘మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరితే సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ‘యూజ్‌లెస్ కాలేజెస్’ అన్నారు. ప్రభుత్వానికి, కాలేజీ యాజమాన్యాలకు సంధానకర్తగా ఉండాల్సిన ఆమె.. మమ్మల్ని అవమానించారు. ఉన్నత విద్యారంగంపై ఆమెకు అవగాహనే లేదు. యూజ్‌లెస్ శ్రీదేవసేన’’ అని తెలంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాల సమాఖ్య (ఫాతి) ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాసంస్థలపై ఇలాంటి అభిప్రాయం ఉన్న అధికారిణి.. కళాశాల బాగోగులు ఎలా చూస్తారని మండిపడ్డారు. ఆమెను వెంటనే ఈ శాఖ నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ చేపట్టిన కళాశాలల బంద్ మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫతేమైదాన్ క్లబ్‌లో బుధవారం ఫాతి అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం ఫాతి అధ్యక్షుడు నిమ్మటూరి రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో 50శాతం చెల్లించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాలేజీల్లో సిబ్బంది తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నారని, వారికి క్షమాపణ చేప్పేందుకు ఈనెల 8న ఎల్బీ స్టేడియంలో లక్ష మందితో తెలంగాణ అధ్యాపక సాంత్వన సభ నిర్వహించనున్నామని వెల్లడించారు. 11న 10లక్షల మంది విద్యార్థులతో సచివాలయానికి లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. రీయింబర్స్‌మెంట్‌పై సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో విషయ పరిజ్ఞానం లేని వారున్నారని, వారిని తొలగించాలని కోరారు. కమిటీ సూచనలు ఇచ్చేందుకు ఉద్దేశించిన 3నెలల గడువును నెల రోజులకు కుదించాలని డిమాండ్ చేశారు. ఫాతి ఉపాధ్యక్షుడు అలీజాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందడం లేదని ప్రభుత్వం చెప్పడం అవమానించడమేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో సత్తా చాటుతున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రభుత్వం రూ.24వేల కోట్లు కేటాయించినా.. వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. ఫాతి ప్రధాన కార్యదర్శి బొజ్జ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగానికి సంబంధించి సీఎంకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చే అధికారులే లేరన్నారు. ఇది ఉన్నత విద్యారంగానికి ఇబ్బందికర పరిణామమన్నారు. అనంతరం 8న నిర్వహించనున్న సభకు సంబంధించిన పోస్టర్లను ఫాతి ప్రతినిధులు ఆవిష్కరించారు.